గణపతి బప్పా మోరియా..

15 Sep, 2018 11:29 IST|Sakshi
మానుకోట పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయకుడు

మహబూబాబాద్‌ రూరల్‌: భక్తుల విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉత్సవ మండళ్లు ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథులు కొలువుదీరారు. మానుకోట జిల్లాగా మారిన తర్వాత రెండోసారి వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,160 వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పలు మండపాల్లో గణపతి విగ్రహాలను ఆకట్టుకునేలా సెట్టింగులు వేశారు.

6వ వార్డులో కౌన్సిలర్‌ గుండా స్వప్న పోతురాజు ఆధ్వర్యంలో 10 అడుగులు మట్టి గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చాలామంది భక్తులు మట్టి వినాయక విగ్రహాలను ఏ ర్పాటు చేయగా, మరికొన్ని చోట్ల పీవోపీ విగ్రహాలను కొలువుదీర్చి పూజలు చేశారు. గణపతి నవరాత్రులు ఈనెల 21 వ తేదీ వరకు జరగనున్నాయి. 22వ తేదీ న గణేషుడి నిమజ్జనం చేయనున్నారు.

జీఎస్టీ ప్రభావం..
వినాయకుడి విగ్రహాల ఏర్పాటు విషయంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తులు జీఎస్టీ ప్రభావంతో తక్కువగా ఏర్పాటు చేశారు. మహబూబాబాద్‌ పట్టణంలో గత ఏడాది 187 విగ్రహాలను ఏర్పాటు చేయగా, ఈ ఏడాది 150కు తగ్గడమే ఇందుకు ఉదాహరణ. కాగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీలు ఆంగోత్‌ నరేష్‌కుమార్, జి.మదన్‌లాల్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత పోలీస్‌ బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు