తాగునీటి కష్టాలు షురూ

26 Feb, 2015 01:52 IST|Sakshi
తాగునీటి కష్టాలు షురూ

తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వేసవి ఆరంభానికి ముందే తాగునీటి కటకట తీవ్రమవుతోంది. గుక్కెడు మంచినీరు కోసం జనం నానాపాట్లు పడుతున్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా నీటి సమస్య జటిలమవుతోంది. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటడంతో ఇంతకాలం గొంతు తడిపిన చేతిపంపులు కూడా వట్టిపోతున్నాయి. బావుల్లో నీరు ఆవిరైపోయింది. వేసవి ఆరంభంలోనే పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక ఏప్రిల్, మే మాసాల్లో నీటి ఎద్దడిని ఎలా ఎదుర్కోవాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకంపై దృష్టి పెట్టినప్పటికీ ప్రస్తుతం దాహం తీరేదెలాగన్నదే ప్రశ్నార్థకంగా మారింది.    
 - సాక్షి నెట్‌వర్క్
 
 ఆదిలాబాద్ జిల్లాలో గోండులు నీటి కోసం అల్లాడుతున్నారు. ఏ గూడెం చూసినా బిందెడు నీటి కోసం రెండుమూడు కిలోమీటర్లు నడిచి వెళుతున్నారు. జిల్లాలో 33 మండలాల పరి ధిలో 307 ఆవాసాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) విభాగం గుర్తించింది. ఇందులో 141 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. అలాగే 27 నివాసిత ప్రాంతాల్లో ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవాలని భావిస్తోంది. మట్టి కూరుకుపోయిన 419 బోర్‌వెల్స్‌ను ఫ్లషింగ్ చేయాలని నిర్ణయించిం ది. మరో 81 చోట్ల బోర్లను మరింత లోతుకు తవ్వాలని ప్రతిపాదిస్తోంది.  ఈ పనుల కోసం రూ. 3.73 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయితే, వేసవి ముం చుకొస్తున్నా పనులు ప్రారంభం కాలేదు.
 
 ఖమ్మంలో నీటి కటకట
 మూడున్నర లక్షల జనాభా కలిగిన ఖమ్మం వాసులకు రోజు విడిచి రోజు తాగునీరు అందుతోంది. మున్నేరు జలాశయం, ఎన్‌ఎస్‌పీ లెఫ్ట్ కెనాల్ ద్వారా సరఫరా జరుగుతోంది. అయితే ఇప్పటికే మున్నేరు అడుగంటింది. పాలేరు రిజ ర్వాయర్ నుంచి కాల్వద్వారా నీటిని తెస్తున్నా రు. ఈ సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. నగర శివారు ప్రాంతాల వాసులు ట్యాం కర్లతో నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోం ది. రెండేళ్ల క్రితం సుమారు రూ. 74 కోట్లతో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో వేసవిలో నీటి ఎద్దడి తప్పేలా లేదు. కొత్తగూడెం పట్టణానికి కూడా మూడురోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి.  15 ఏళ్ల క్రితం నిర్మించిన కిన్నెరసాని పథకం పై ప్‌లైన్ తరుచూ లీకేజీ అవుతోంది.  పాల్వం చ, ఇల్లెందు తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి.
 
 నిజామాబాద్‌లో ప్రమాద ఘంటికలు
 నిజామాబాద్ జిల్లాలో 137 గ్రామాల్లో భూగ ర్భ జలాలు అడుగంటిపోయి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ గ్రామాల్లో కొత్తగా బోర్లు వేయరాదని అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. జిల్లాలో 1,091 ఆవాసాల్లో తాగునీటి సమస్య నెలకొందని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు గుర్తించారు. 2,603 చేతిపంపులు ఎండిపోయాయి. 56 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. రూ. 158.82 కోట్లతో చేపట్టిన 374 చిన్న చిన్న తాగునీటి పథకాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 16 సీపీడబ్ల్యుఎస్ పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. 16 మంచినీటి పథకాల నిర్వహణకు విద్యుత్ కొరత, భూగర్భజలాల కొర త, తరచూ పగిలిపొతున్న పైపులైన్లు ప్రతిబంధకంగా మారాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి  పరి దిలో 369 ఆవాసాలకు రక్షిత మంచినీటి సరఫరా చేసే పథకం అసంపూర్తిగానే మిగిలింది.
 
 కరీంనగర్‌లో వెయ్యికిపైగా గ్రామాల్లో..
 కరీంనగర్ జిల్లాలో 1,092 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. దీన్ని ఎదుర్కొనేందుకు రూ. 16కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. పెద్దపల్లి, మంథని, మానకొండూర్, హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలో సమస్య తీవ్రంగా ఉంది. జిల్లా అవసరాలు తీర్చే మానేరు డ్యాంలో 7.82 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. సిద్దిపేట తాగునీటి పథకానికి, కరీంనగర్ పట్టణ అవసరాలకు మాత్రమే ఈనీటిని సరఫరా చేస్తున్నారు.
 
 మహబూబ్‌నగర్ గొంతెండుతోంది
 మహబూబ్‌నగర్ జిల్లాలో 2,688 గ్రామాల్లో తాగునీటి కి కటకట నెలకొంది. బోంరాస్‌పేట్, మాడ్గుల్, కొత్తూరు, మద్దూరు, ఆమనగల్లు, తలకొండపల్లి, కొందుర్గు, బిజినేపల్లి, దౌల్తాబాద్ మండలాల పరిధిలో సమస్య తీవ్రంగా ఉంది. 195 నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్లతో సరఫరానే శరణ్యమని అధికారులు గుర్తించా రు. పలు ప్రాంతాల్లో ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు.
 
 బురదనీటిలో వెదుకులాట..
 మెదక్ జిల్లాలో వేసవి ప్రారంభంలోనే సమస్య తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎద్దడి తీవ్రంగా ఉంది. నియోజకవర్గంలోనే మం జీరా నది ప్రవహిస్తున్నా తండాలు, గ్రామాల్లోని ప్రజలకు మాత్రం గుక్కెడు నీరు దొరకడం కష్టమవుతోంది. నియోజకవర్గం పరి దిలో 124 పంచాయతీలు, 180 తండాలకు మంచినీటిని అందించాలనే లక్ష్యంతో 90 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం పను లు నత్తనడకన సాగుతున్నాయి.  
 
 ‘ధర్మ’ సందేహమే..
 వరంగల్ నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం ధర్మసాగర్, భద్రకాళి, వడ్డేపల్లి చెరువుల నీటిని కేటాయించారు. పెరిగిన నగర జనాభా అవసరాలను ఈ మూడు చెరువులు తీర్చలేకపోతున్నాయి. దిగువ మానేరు, దేవాదుల ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా 1.8 టీఎంసీల నీటితో ఈ చెరువులను నింపుతున్నారు. దీంతో ఏడాది పొడవునా రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం ధర్మసాగర్ చెరువు నీటిమట్టం 29.0 అడుగులకు, భద్రకాళి చెరువు 13.2 అడుగులకు, వడ్డేపల్లి చెరువు నీటిమట్టం 11.6 అడుగులకు పడిపోయింది. రామప్ప చెరువులో 19 అడుగల వద్ద నీటిమట్టం ఉంది. దీని ద్వారా ములుగు, ఘణపురం, వెంకటాపురం మండలాల పరిధిలో 49 గ్రామాలకు తాగునీరు అందుతోంది. నీటిమట్టం తక్కువగా ఉండటంతో ఇకపై సరఫరా ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని వార్తలు