4 ప్రాజెక్టులకు 11 నుంచి నీటి విడుదల

8 Aug, 2014 02:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని 4 ప్రధాన ఎత్తిపోతల ప్రాజెక్టులు.. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ల కింది ఆయకట్టుకు ఈ నెల 11 నుంచి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూరాల, శ్రీశైలం నుంచి ఈ ఆయకట్టులోని లక్షా 29వేల ఎకరాలకు నీరందించాలని సంకల్పించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి గతేడాదే 75 శాతం పనులు పూర్తయ్యాయి. అప్పడు కూడా జూరాల, శ్రీశైలం నుంచి నీటి విడుదల జరిగినా, పనులు పూర్తికాకపోవడం వల్ల ఆయకట్టు లక్ష ఎకరాలకు మించలేదు.

ఈ ఏడాది కాలంలో మరో 10 శాతం పనులు పూర్తికావడంతో ఆయకట్టు మరో 40 వేల ఎకరాలు పెరగనుందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు జూరాల ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఒప్పందం మేరకు ఒక వారం కర్ణాటక, మరోవారం తెలంగాణ వాడుకోవాలి. ఈ వారం మొత్తం విద్యుత్‌ను కర్ణాటక వాడుకోగా, సోమవారం నుంచి తెలంగాణ వంతు రానుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మొత్తం 120 మెగావాట్ల విద్యుత్‌లో 97 మెగావాట్లను ఎత్తిపోతలకు వాడుకొని ఈ నాలుగు ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని వార్తలు