‘మెగా’ పవర్‌ ఘనత మనదే!

25 Apr, 2019 04:51 IST|Sakshi

అత్యధిక సామర్థ్యం గల పంపుల ప్రయోగం విజయవంతం 

124.4 మెగావాట్ల పంపుల వాడకం దేశ చరిత్రలోనే తొలిసారి  

హర్షం వ్యక్తంచేసిన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: భారతదేశ చరిత్రలో తొలిసారిగా సాగునీటి రంగంలో అత్యధిక మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా ఉపయోగంలోకి తెచ్చిన ఘనత తెలంగాణ విద్యుత్తు సంస్థలకు దక్కడం ఆనందదాయకమని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. 124.4 మెగావాట్ల కాళేశ్వరం ప్రాజెక్టు (మేడారం–ప్యాకేజీ– 6) మొదటి పంపు వెట్‌రన్‌ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, అందులో రాష్ట్ర విద్యుత్‌ సంస్థల శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌ కు ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడవడానికి కావాల్సిన విద్యుత్‌ సౌకర్యం అందించడానికి రెండేళ్లకు పైగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పని చేసిన విద్యుత్‌ సిబ్బందిని ప్రభాకర్‌రావు అభినందించారు. కాళేశ్వరంతో పాటు తెలంగాణలోని అన్ని ఎత్తిపోతల పథకాలకు కావాల్సిన విద్యుత్తును ఎలాంటి ఆటంకాలు లేకుండా అందించడానికి పునరంకితమవుతామని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయడం ద్వారా కొత్త రికార్డు సృష్టించిన విద్యుత్‌ సంస్థలు.. ఎత్తిపోతల పథకాలకు రికార్డు స్థాయి ఏర్పాట్లు చేయడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో తెలంగాణ వ్యవసాయాభివృద్ధిలో విద్యుత్‌ సంస్థలు గణనీయమైన పాత్రను పోషించడం ఆనందదాయకమని వ్యాఖ్యానించారు. 

విద్యుత్‌శాఖ రికార్డుస్థాయి ఏర్పాట్లు... 
భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలం గాణ విద్యుత్‌ సంస్థలు రాష్ట్రంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌ సరఫరా చేయడానికి రికార్డు స్థాయి ఏర్పాట్లు చేశాయి. ప్రాజెక్టును విజయవంతం గా నిర్వహించడంలో విద్యుత్‌ శాఖకున్న ప్రాధా న్యాన్ని మొదట్లోనే గుర్తించిన కేసీఆర్‌.. దీనికి అనుగుణంగా విద్యుత్‌ అధికారులను అప్రమత్తం చేశారు. విద్యుత్‌ శాఖ చరిత్రలోనే మొదటి సారిగా ట్రాన్స్‌కోలో ఎత్తిపోతల పథకాలకు ప్రత్యేక డైరెక్టర్‌ (సూర్య ప్రకాశ్‌)ను నియమించారు. ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారులు ప్రతీ వారం క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వ హించారు. ఆస్ట్రియా తదితర దేశాలు పర్యటించి పంపుల సామర్థ్యాన్ని మదింపు చేశారు.

బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం చేసు కుని వివిధ ప్లాంట్లలో సమాంతరంగా ప్రత్యేక పంపులను తయారు చేయించారు. రూ.2,890 కోట్ల వ్యయంతో 5వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేశారు. మొత్తం 15 పంపుహౌజుల వద్ద 15 డెడికేటెడ్‌ సబ్‌స్టేషన్లు నిర్మించారు. వివిధ కేటగిరీల్లో 80 పంపులు బిగించా రు. గతంలో కేవలం 30 మెగావాట్ల విద్యుత్‌ పంపు లు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉంది. కానీ చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ విద్యుత్‌ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో 139 మెగావాట్ల పం పులు (ప్యాకేజీ 8 – రామగుడు) ఉపయోగిస్తున్నారు. భారత్‌లో ఇంత భారీ సామర్థ్యంతో ఎక్కడా ఎవరూ పంపులు వాడలేదు. సముద్రమట్టానికి 550 మీటర్లకు పైగా ఎత్తుకు నీటిని పంపింగ్‌ చేసి, తెలంగాణ బీళ్లకు నీటిని మళ్లించే బృహత్‌ కార్యానికి విద్యుత్‌ సంస్థలు ఇరుసుగా పనిచేస్తున్నాయి.  

>
మరిన్ని వార్తలు