హస్తినాపురాధీశ్వరుడెవరు?

25 Apr, 2019 04:53 IST|Sakshi

మారిపోతున్న ఓటర్ల మూడ్‌

మూడేదెవరికి? కలిసొచ్చేదెవరికి?

రాజధాని ఢిల్లీలో ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌), కాంగ్రెస్‌ మధ్య పొత్తు కుదరకపోవడంతో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఆ రెండు పార్టీల కూటమి వైఫల్యం బీజేపీకి గెలుపు సోపానంగా మారుతుందనే అంచనాలు పెరిగిపోయాయి.  గత ఎన్నికల్లో బీజేపీ ఏడు సీట్లలోనూ ఘన విజయం సాధించి రాజధానిని క్లీన్‌ స్వీప్‌ చేసింది.  అయితే కాంగ్రెస్, ఆప్‌ చేతులు కలిపితే ఆ రెండు పార్టీలు కలిపిన ఓటు షేర్‌తో బీజేపీని ఆరుస్థానాల్లో కట్టడి చేసి ఉండేవని ఒక అంచనా. ఇప్పుడు పొత్తు కుదరకపోవడంతో త్రిముఖ పోటీలో కమలనాథులే పై చేయి సాధిస్తారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  

అరవింద్‌ కేజ్రీవాల్‌కి చెందిన ఆప్‌ 2013లో రాజకీయ రంగస్థలంలోకి అడుగు పెట్టాక ఢిల్లీ  ఓటర్ల్ల ఆలోచనా ధోరణి ఎన్నికల ఎన్నికలకి మారిపోతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు కొనసాగి మూడు పార్టీలు ఓట్లను ఇంచుమించుగా సమానంగా పంచుకోవడంతో త్రిశంకు సభ ఏర్పడింది.  బీజేపీ అత్యధిక సీట్లు సాధించినా, ఆప్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్‌ బయట నుంచి మద్దతు ఇచ్చింది. తర్వాత ఏడాదికే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చాడు. బీజేపీ ఏడు లోక్‌సభ స్థానాలకు గాను అన్నింట్లోనూ విజయభేరి మోగించింది. అంతలోనే అసెంబ్లీ రద్దయింది. మళ్లీ 2015లో అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈసారి ఓటరు ఆప్‌కి బ్రహ్మరథం పట్టాడు.

70 అసెంబ్లీ స్థానాలకు గాను ఎవరూ ఊహించని రీతిలో 54.3% ఓటు షేరుని సాధించి 67 స్థానాలను ఊడ్చేసింది. మిగిలిన మూడు స్థానాల్లో బీజేపీ నెగ్గింది.  కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. మళ్లీ రెండేళ్లకే సీన్‌ మారిపోయింది. 2017లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ ఓటు షేర్‌ 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే ఏకంగా 28 శాతం తగ్గిపోయింది. కాంగ్రెస్‌ ఓటు షేరు మళ్లీ పెరిగింది. బీజేపీ 36శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈ ఎన్నికలతో సార్వత్రిక ఎన్నికల్ని పోల్చి చూడలేము. న్యూఢిల్లీ మున్సిపల్‌  కార్పొరేషన్, ఢిల్లీ కంటోన్మెంట్‌ బోర్డులు కూడా ఢిల్లీ రాష్ట్రం పరిధిలోకి వస్తాయి. ఇదంతా చూస్తుంటే ఢిల్లీ ప్రజలు ప్రధానిగా నరేంద్రమోదీని, సీఎంగా కేజ్రీవాల్‌ని కోరుకుంటున్నారని అర్థమవుతోంది. అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం అటూ ఇటూ కానీ తీర్పు ఇచ్చి రాజకీయ విశ్లేషకుల్ని సైతం గందరగోళంలో పడేశారు.

ఓటింగ్‌ శాతాన్ని ఎలా విశ్లేషించాలి ?  
ఢిల్లీ ఎన్నికల విశ్లేషణలో ఓట్ల శాతం కూడా ముఖ్యమైన అంశమే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 65.1 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2009 ఎన్నికలతో పోల్చి చూస్తే ఇది 14శాతం ఎక్కువ. దీని ప్రభావంతో భారత దేశం మొత్తమ్మీద సగటు ఓటింగ్‌ శాతం పెరిగింది. 2009లో 58.2% నుంచి 2014లో 66.4శాతానికి పెరిగింది. కొత్త పార్టీ ఎన్నికల బరిలో దిగడంతో అత్యధికంగా ఓటర్లు పోలింగ్‌ బూతులకు తరలి వచ్చారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఓట్ల శాతం మళ్లీ పెరిగితే, జనం నాడి పట్టుకోవడం కష్టమేనన్న అంచనాలున్నాయి.

మరిన్ని వార్తలు