ప్రాజెక్టులపై రాజకీయాలొద్దు

24 Nov, 2023 04:45 IST|Sakshi

ప్రాజెక్టుల ఖర్చు రూ.1.70 లక్షల కోట్లు: మంత్రి కేటీఆర్‌ 

బదనాం చేసి అన్యాయం చేయొద్దు 

బ్యారేజీల్లో సమస్యలు సాధారణం 

మిషన్‌ భగీరథకు రూ.37 వేల కోట్లు ఖర్చు.. గణాంకాలతో మంత్రి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం, పాలమూరు సహా ఇతర ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంను నాలుగేళ్లలోనే పూర్తి చేశామని చెప్పారు. కాళేశ్వరం అంటే అనేక బ్యారేజీలు, రిజర్వాయర్లు, లిఫ్టులు, వందల కిలోమీటర్ల కాలువలు అని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దని, వాటిని బదనాం చేసి తెలంగాణకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

బ్యారేజీల్లో సమస్యలు అత్యంత సాధారణమన్నారు. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం తర్వాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయని, రెండేళ్ల క్రితం శ్రీశైలం పవర్‌ హౌస్‌ పంపులు కూడా నీట మునిగాయని గుర్తు చేశారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం, రంగాల వారీగా రాష్ట్రం పురోగమించిన తీరుపై గురువారం హైదరాబాద్‌లో ఆయన గణాంకాలతో కూడిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  

నిండుకుండల్లా 46 వేల చెరువులు 
‘మిషన్‌ భగీరథ ద్వారా రూ.37 వేల కోట్లు ఖర్చు చేసి 58 లక్షల కుటుంబాలకు తాగునీరు అందిస్తున్నాం. దీని స్ఫూర్తితో కేంద్రం ‘హర్‌ ఘర్‌ జల్‌’పథకాన్ని ప్రారంభించింది. దీనితో పాటు అనేక తెలంగాణ పథకాలు కేంద్రం, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మిషన్‌ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన 46 వేల చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. సాగునీటితో సంపదను సృష్టించాం. 

ధాన్యం ఉత్పత్తిలో అన్నపూర్ణగా రాష్ట్రం 
ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అన్నపూర్ణగా మారింది. రైతును రాజును చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే చెప్పింది. తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలపగా, జీఎస్‌డీపీ అత్యంత వేగంగా పెరిగింది. రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందింది. పేదరికాన్ని తగ్గించిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. తండాలు గ్రామ పంచాయతీలుగా మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటు వంటివి కేసీఆర్‌ పాలనలోనే జరిగాయి..’అని కేటీఆర్‌ తెలిపారు.  

ధరణితో పారదర్శకంగా రిజిస్ట్రే షన్లు  
‘భూ యజమానుల వేలి ముద్రకు అధికారమిచ్చి ‘ధరణి’ద్వారా పారదర్శకంగా భూ లావాదేవీలు జరిగేలా చూస్తున్నాం. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు, పల్లె ప్రగతితో గ్రామ స్వరాజ్యం, గ్రీన్‌ కవర్‌ 7.7శాతానికి పెంపు, హరిత నిధి ఏర్పాటు వంటి వాటికి ప్రాధాన్యతను ఇచ్చాం. మన ఊరు – మన బడితో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, వేయి గురుకుల పాఠశాలల ఏర్పాటు, 32 కొత్త మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటివి మా ప్రభుత్వం సాధించిన విజయాలు. 

గ్రేటర్‌లో మెట్రో రైలు వ్యవస్థ 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డీపీ)కింద రహదారుల అభివృద్ధి, ఫ్లైఓవర్‌ల నిర్మాణంతో ట్రాఫిక్‌ జామ్‌లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే 72 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలు వ్యవస్థను అభివృద్ధి చేశాం. మరో 450 కిలోమీటర్ల మేరకు దీన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. నగరంలో ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా జరుగుతోంది.

భవిష్యత్తులో ప్రతిరోజు నీటి సరఫరాకు ప్రయత్నిస్తున్నాం. మురుగునీటి పారుదల శుద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి మునిసిపాలిటీలో సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు నిర్మిస్తున్నాం..’అని కేటీఆర్‌ తెలిపారు. కేంద్రంలోని దుర్మార్గ ప్రభుత్వం తెలంగాణకు అప్పులు పుట్టకుండా కుట్ర చేస్తోందని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ప్రజలకు కరెంటు ఉండదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.    

మరిన్ని వార్తలు