చేపా చేపా నీకేమైంది?

23 Jun, 2018 02:43 IST|Sakshi
మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం గోమారం చెరువులో చేపలు ఎదగలేదని చూపుతున్న మత్స్యకారులు

ఈ ఏడాది లక్ష్యం చేరని ‘చేపల పెంపకం’

ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్నా లోపాలతో కుదేలు 

ముప్పావు కిలో కూడా ఎదగని చేపలు 

నేతి బీరగా మారిన విత్తన నాణ్యత 

మార్కెటింగ్‌ లేమితో దళారుల పాలు

లాభాలకు నోచని మత్స్యకారులు

‘మిషన్‌ కాకతీయ’ చెరువుల్లో కాస్త మెరుగు

చేపా చేపా... ఎందుకు ఎదగలేదు? నాణ్యమైన విత్తనం వేయక... అదనులో వానల్లేక... చెరువుల్లో నీరు అడుగంటి... ...ఇలా ఒకటా, రెండా? కర్ణుడి చావు మాదిరిగా ఎన్నో కారణాలున్నాయి!!
 

సాక్షి నెట్‌వర్క్‌: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం చెరువుల్లో చేపలు పెంచే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. చెరువులు, కుంటల్లో మత్స్య శాఖ మూడేళ్లుగా చేప పిల్లలను వదులుతోంది. వాటిని ఉచితంగా పంపిణీ చేసేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ఇంత చేస్తున్నా ప్రభుత్వ లక్ష్యం మాత్రం ఈ ఏడాది పూర్తిస్థాయిలో నెరవేరలేదు. నిర్వహణ లోపాల వల్ల అనుకున్న ప్రగతి సాధించలేకపోయారు. గతేడాది అనుకున్న స్థాయిలో భారీ వర్షాలు కురవకపోవడం, చేప విత్తనాలను ఆలస్యంగా వదలడం, ఫీడింగ్‌ సరఫరా చేయకపోవడంతోపాటు చేపపిల్లల్లో నాణ్యత లేకపోవడం ప్రధాన కారణాలుగా కన్పిస్తున్నాయి. దాంతో ఈ ఏడాది మత్స్యకారులు లాభాలను కళ్లచూడలేకపోయారు. ఈ ఏడాది మిషన్‌ కాకతీయలో భాగంగా బాగు చేసిన చెరువుల్లో మాత్రం గతేడాది కన్నా ఈసారి చేపల దిగుబడి అధికంగా వచ్చింది. వాటిల్లో ఏడాది పొడువునా నీరుండటంతో చేపలు బతికి మత్స్యకారులు కాస్త ఆదాయం కళ్లజూశారు. 

 భువనగిరి మండలం రాయగిరి చెరువులో నీరు లేకపోవడంతో చేపలు పడుతున్న మత్స్యకారులు
భువనగిరి మండలం రాయగిరి చెరువులో నీరు లేకపోవడంతో చేపలు పడుతున్న మత్స్యకారులు 

వానల్లేక... 
చెరువుల్లో చేపల పెంపకం పథకం కోసం ఈ–టెండర్‌ విధానంలో ఏపీలోని కైకలూరు నుంచి చేప విత్తనాలు తీసుకొస్తున్నారు. ప్రధానంగా కట్ల, రోహు, మ్రిగాల, బంగారు తీగ, బొచ్చలతో పాటు అక్కడక్కడ నీలకంఠ రకం రొయ్యలను పోస్తున్నారు. గతేడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో జూన్‌లో వదలాల్సిన చేప విత్తనాలను ఆలస్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వదిలారు. కొన్ని ప్రాంతాల్లోనైతే నవంబర్, డిసెంబర్‌ నెలల్లో పోశారు! చిన్నాచితక వర్షాలు మినహా అనుకున్న స్థాయిలో వానల్లేక వర్షాధార చెరువుల్లో నీరు తగ్గింది. నీటికుంటలూ ఎండిపోయాయి. దాంతో దాదాపుగా 30 శాతం చెరువుల్లో సగానికి పైగా చేపలు చనిపోయాయి. ఇది చాలదన్నట్టు ఎదిగీ ఎదగక ముందే చలికాలం ప్రారంభమవడం చేపల పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. గత సెప్టెంబర్‌లో వదిలిన చేప పిల్లలు ఇప్పుడు కేవలం 600 గ్రాముల నుంచి 800 గ్రాముల మధ్య మాత్రమే ఎదిగాయి. నిజానికి వర్షాకాలం ప్రారంభంలోనే చేప పిల్లలను వదలాల్సి ఉంటుంది. జూన్, జూలై తర్వాత వదిలితే ఎదుగుదల సరిగా ఉండదని మత్స్యకారులు చెబుతున్నారు. ఏడాదంతా నీరు నిల్వ ఉండే చెరువుల్లో 80 నుంచి 100 మి.మీ. సైజున్న చేపలను, వర్షాధార చెరువులు, కుంటల్లో 35 నుంచి 40 మి.మీ. చేపలను వదులుతున్నారు. వీటిలో 50 నుంచి 60 శాతం మాత్రమే వృద్ధి అవుతున్నాయని మత్స్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. 

నాణ్యమైన పిల్లలనూ ఇవ్వడం లేదు... 
ఉన్న సమస్యలకు తోడు ప్రభుత్వం సరఫరా చేస్తున్న చేప పిల్లల్లో నాణ్యత కూడా లోపిస్తోందని రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల మత్స్యకారులూ వాపోతున్నారు. ఆ విత్తనాలను కూడా ఆలస్యంగా పంపిణీ చేస్తున్నారు. దాంతో, 8 నెలల్లో 3 నుంచి 4 కిలోలు పెరగాల్సిన చేపల బరువు కిలో లోపే ఉంటుండటం దుస్థితికి అద్దం పడుతోంది. ఈ ఆలస్యాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న దళారులు మత్స్యకారులతో మాట్లాడుకుని తమకే తెగనమ్మేలా ఒప్పందం కుదుర్చుకుంటూ చేపపిల్లలను తెచ్చి వదులుతున్నారు. ఇలా దళారుల వలకు చిక్కి మత్స్యకారులు బిక్కమొకం వేస్తున్నారు. 

మార్కెట్‌ సదుపాయమేది? 
మార్కెట్‌ సదుపాయాల లేమి కూడా మత్స్యకారులకు శాపంగా మారింది. పలు ప్రాంతాల్లో చేపల మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ అవి పలు కొన్ని చోట్ల స్థల ఎంపిక దశలో ఉండగా మిగతా చోట్ల అది కూడా జరగలేదు. చేపలు పట్టిన వెంటనే నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో దళారులు కారుచౌకగా కొనుగోలు చేస్తున్నారు. వాటిని పట్టణాలకు తరలించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన దళారులే చేపల మార్కెట్‌ను నియంత్రిస్తున్నారు. చేపలు పాడవకుండా లాండింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నా ఆ దిశగా అడుగు పడలేదు.  
పలు జిల్లాల్లో ఇదీ పరిస్థితి... 

  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 275 మత్స్యకార సంఘాలున్నాయి. గతేడాది 918 చెరువులు, 14 ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో రూ.8.41 కోట్ల విలువైన చేపపిల్లలు వదిలారు. ఈ ఏడాది 20,900 టన్నుల చేపలు ఉత్పత్తయ్యాయి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేపలు త్వరగా పెరగడం లేదనేది ఇక్కడి మత్స్యకారులు ఆవేదన. 
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 963 చెరువులు, 230 మత్య్సకార సంఘాలున్నాయి. ఈ ఏడాది రూ.3.40 కోట్ల విలువైన 4.92 కోట్ల చేప పిల్లలను వదిలారు. 13,800 టన్నుల చేప పిల్లలు ఉత్పత్తి అయ్యాయి. ఉత్పత్తి గతేడాది 8 వేల టన్నులే ఉండగా ఈసారి 12 వేల టన్నులకు పెరిగిందని అధికారులు అంటున్నారు. 
  • నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో గతేడాది 1.72 కోట్ల చేప పిల్లలు వదిలారు. ఇప్పుడు నీరు తగ్గడంతో చేపలు పడుతున్నారు. ఇప్పటికి 3,071 మెట్రిక్‌ టన్నుల చేపలను విక్రయించారు. రూ.27.63 కోట్ల ఆదాయం సమకూరింది. 
  • నల్లగొండ జిల్లాలో 90 శాతం చెరువులను కాంట్రాక్టర్లే గుప్పిట్లో పెట్టుకున్నారు. జిల్లాలో 177 డిపార్ట్‌మెంట్‌ చెరువులు, 8 జలశయాలు, 490 గ్రామ పంచాయితీ చెరువులున్నాయి. వీటిలో గతేడాది రూ.2.96 కోట్ల విలువ గల 3.7 కోట్ల చేప పిల్లలను పోస్తే ఇప్పటికీ చాలా చెరువుల్లో కేజీ లోపు మాత్రమే పెరిగాయి. 
  • వరంగల్‌ జిల్లాలో గతేడాది 10.49 కోట్ల చేప పిల్లలు వదిలారు. 32,174 టన్నులు చేపల ఉత్పత్తి జరిగింది. మత్స్య కార్మికులకు రూ.207 కోట్ల ఆదాయం సమకూరింది. 

చేపలు పెరగలేదు.. 
మా ఊరి చెరువులో లక్ష చేప పిల్లలు వదిలాం. మాకు సెప్టెంబర్‌ చివరి వారంలో పంపిణీ చేశారు. సకాలంలో వానలు రాక పిల్లలు పెరగలేదు. రూ.70 వేల విలువైన పిల్లలు వేస్తే రూ.70 వేల దిగుబడే వచ్చింది. ఒక్కో చేప కనీసం కిలోన్నర పెరగాలి. కానీ ఈసారి ఒక్కో పిల్ల ముప్పావు కిలో మాత్రమే పెరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలస్యంగా కాకుండా చేప పిల్లలను జూలై తొలి వారంలో పంపిణీ చేయాలి. అప్పుడు అధిక వర్షాలకు చేప పిల్లలు పెరుగుతాయి. మత్స్యకారులకు లాభం చేకురుతుంది. – ఎడ్ల భీమయ్య, కనికి సొసైటి అధ్యక్షుడు, కౌటాల మండలం, కుమురం భీం జిల్లా. 
 
ఆశలకు గండి కొట్టారు 
యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని గండి చెరువులో 4 నెలల కింద 50 వేల చేప పిల్లలను వదిలాం. ఇప్పుడవి ఎదిగే దశలో ఉన్నాయి. బాగా వానలు పడితే మా బతుకులు మారుతాయని 150 మంది మత్స్యకారులం సంతోషించాం. కానీ గండి చెరువును అభివృద్ధి చేస్తున్న కాంట్రాక్టర్లు ఆ ఆశలకు గండి కొట్టారు. అభివద్ధి పేరుతో గండి పెట్టి నీటిని తరలించడంతో చేప పిల్లలన్నీ కొట్టుకుపోయాయి. 4 నెలలు ఆగితే అవి పెరిగి మా బతుకులు బాగుపడేవి. – పల్లెపాటి రాంనర్సయ్య, మత్స్యకారుడు, యాదగిరిగుట్ట 
 
చేపల మార్కెట్లు లేక నష్టపోతున్నాం 
పాలేరు చెరువుపై వందలాది మంది మత్స్యకారులం బతుకుతున్నాం. ఏటా 250 టన్నుల చేపలు పడుతుంటాం. మాకు మార్కెట్లు లేక ఉన్న చేపంతా ఒక్క రోజే అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. నాయకన్‌గూడెం, పాలేరుల్లో చేపల మార్కెట్లు, కోల్డ్‌ స్టోరేజీలు నిర్మిస్తే చేపలను మంచి ధరకు అమ్ముకోగలుగుతాం. జనానికీ ఎక్కువ రోజులు చేపలను అందుబాటులో ఉంచగలుగుతాం. – దేశబోయిన ఏడుకొండలు, మత్స్య సొసైటీ కార్యదర్శి 

చేపల ఉత్పత్తి పెరిగింది.. 
ఈసారి నాగార్జున సాగర్‌తో పాటు చెరువుల్లోకీ నీరు రావడంతో చేపల పెంపకం ఆశాజనకంగా ఉంది. మిషన్‌ కాకతీయతో చెరువుల్లోనూ నీరు నిల్వ ఉండటం చేపల ఉత్పత్తి, పెంపకానికి దోహదపడింది. దిగుబడి గతేడాది 8 వేల టన్నులు మించలేదు. ఈసారి 12 వేల టన్నులొచ్చింది. రిజర్వాయర్‌లో పోసిన చేపలు కిలోన్నర దాకా, పంచాయతీ చెరువుల్లోని చేపలు ముప్పావు కిలో దాకా పెరిగాయి. – హన్మంతరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఖమ్మం 

మరిన్ని వార్తలు