కృష్ణా జలాల వివాదం.. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తితో బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా

18 Oct, 2023 17:12 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ:  తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను నవంబర్ 22, 23 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు బుధవారం ట్రిబ్యునల్‌ తెలిపింది. 

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా నది జలాల పంపకాలపై విచారణాంశాలను నోటిఫై చేసింది కేంద్రం. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించిన విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈనెల 6న నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.  ఆ ఆదేశాలను అనుసరించి.. విచారణకు సిద్ధమైంది  బ్రిజేష్ ట్రిబ్యునల్. మరోవైపు నవంబర్ 15 లోపు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ పై అభిప్రాయం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయితే ఇవాళ విచారణ ప్రారంభం కాగా.. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ పై అధ్యయనం చేయాల్సి ఉందని, దానిపై పూర్తి అధ్యయనం చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం త్వరగతిన విచారణ చేపట్టాలని కోరింది. నీటి పంపకాలను వెంటనే చేపట్టాలని ట్రిబ్యునల్‌కు కోరింది. అయితే ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణను వాయిదా వేసింది ట్రిబ్యునల్‌.

మరిన్ని వార్తలు