కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: ఈటెల రాజేందర్

8 Aug, 2014 03:59 IST|Sakshi
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: ఈటెల రాజేందర్

సాక్షి, హైదరాబాద్ :  రాష్ట్రంలో ధాన్యాన్ని అక్రమంగా నిల్వచేయడం, బ్లాక్ మార్కెటింగ్‌లకు పాల్పడే మిల్లర్లపై, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు. గురువారం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మిల్లర్లు ధాన్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచుకొని, కృత్రిమ కొరత సృష్టించకుండా ముందుగానే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా,  రాష్ట్రంలో ఇప్పటివరకు 5.5లక్షల బోగస్ కార్డులు సరెండర్ అయ్యాయని, ఆధార్‌ను పీడీఎస్‌కు అనుసంధానించడం ద్వారా మరో 34 లక్షల మంది బోగస్ లబ్ధిదారులను ఏరివేశామని మంత్రి వివరించారు.
 
 నాణ్యమైన విద్య అందించటమే లక్ష్యం
 అందరికి నాణ్యమైన విద్యను అందించటమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) నాల్గవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘మన తెలంగాణ - మన విద్యా విధానం’పై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖకు అందించే నిధులను పెట్టుబడి అని అనాలి అంతేకానీ ఖర్చు చేశాం అనకూడదని, పిల్లలు ప్రపంచంలో పోటీపడే నైపుణ్యాన్ని సంపాదించుకుంటే సమాజానికి ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా మంత్రి జగదీశ్‌రెడ్డి, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆటవీ మంత్రి జోగు రామన్న, టీయూటీఎఫ్ అధ్యక్షులు స్వామిరెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి డి.మల్లారెడ్డి తదిరతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు