హెల్త్‌ సిటీ..

7 Apr, 2018 13:20 IST|Sakshi

కానీ కాలుష్యం కాటేస్తోంది

హెల్త్‌ సిటీగా భాగ్య నగరికిప్రపంచ వ్యాప్త గుర్తింపు

జీవించేందుకు అత్యంతఅనువైన నగరాల్లో 142వ ర్యాంక్‌

సగటు జీవన కాలం 68.5 ఏళ్లు

ఇప్పుడిప్పుడే మారుతున్నసిటీ వాతావరణం

గాలి, నీటి కాలుష్యంతోనే  పెరుగుతున్న అవస్థలు

మేల్కోవాలంటున్న పర్యావరణ వేత్తలు

ప్రపంచంలో జీవించేందుకు అనువైన అత్యున్నత నగరాల సరసన మన గ్రేటర్‌ సిటీ స్థానం సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా 142వ ర్యాంకుతో దేశంలోని ఇతర నగరాల కంటే కూడాభాగ్యనగరం మెరుగైన పరిస్థితిలో ఉంది. ఇక్కడ పురుషులు 69.4 ఏళ్లు, మహిళలు 73.2 ఏళ్ల సగటు జీవన కాలాన్ని కలిగి ఉండడం గర్వకారణం. మెరుగైన వసతులు, సమతుల్య వాతావరణం, అత్యాధునిక వైద్య సేవల కారణంగా సిటీజనుల ఆయుప్రమాణం క్రమంగా పెరుగుతోంది. అయితే ఇదంతా నాణేనికి ఒక పార్శ్వమే. మరో వైపు చూస్తే.. మానవ సంబంధ కార్యకలాపాలు,పట్టణీకరణ, వాహన విస్ఫోటనం, పారిశ్రామిక, జల వనరుల కాలుష్యం వెరసి నగర పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నగరంలో హరితవాతావరణం, గాలి, నీరు, నేల కాలుష్యం...మనం సాధించిన మెరుగైన ర్యాంకుపై కథనం..

సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచంలో జీవించేందుకు అనువైన అత్యున్నత నగరాల సరసన మన గ్రేటర్‌ సిటీ దేశంలోని పలు మెట్రో సిటీల కంటే మెరుగైన స్థానంలో ఉంది. మెర్సర్‌ సంస్థ 2018లో చేపట్టిన సర్వేలో గత నాలుగేళ్లుగా మన సిటీ 142వ స్థానం సాధించి దేశంలోని పలు మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ పురుషులు 69.4 ఏళ్లు, మహిళలు 73.2 ఏళ్ల సగటు జీవన కాలాన్ని కలిగి ఉండడం గర్వకారణం. హెల్త్‌సిటీగా పేరొందిన మహానగరంలో అత్యున్నత వైద్యప్రమాణాలు, రోబోటిక్‌ సర్జరీలు, కేన్సర్‌ వంటి మొండి జబ్బులకు సైతం అత్యుత్తమ చికిత్సలు లభ్యమౌతుండడంతో సిటీజన్ల ఆయుప్రమాణం క్రమంగా పెరుగుతోంది. అయితే ఇదంతా నాణేనికి ఒక పార్శ్వమే. మరో వైపు చూస్తే.. పట్టణీక రణ, వాహన విస్ఫోటనం, పారిశ్రామిక, జలవనరుల కాలుష్యం వెరసి నగర పర్యావరణం హననమవుతుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

హరితం హననం..
శతాబ్దాలుగా తోటల నగరం(భాగ్‌)గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇపుడు హరితం రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండడం, కాలుష్యం పెరగడం వల్ల పర్యావరణం త్వరగా వేడెక్కుతోంది. గ్రేటర్‌ నగర విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. అంటే 1.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. సిటీలో హరితం శాతం 8 మాత్రమే. అంటే మహానగరంలో సుమారు 12,320 ఎకరాల్లో హరితవాతావరణం(గ్రీన్‌బెల్ట్‌)అందుబాటులో ఉంది. దీన్ని 24,710 ఎకరాలకు పెంచాల్సి ఉంది. అంటే మొత్తం నగర విస్తీర్ణంలో హరితం శాతం కనీసం 16 శాతానికైనా పెంచాల్సిన ఆవశ్యకత ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ఒకప్పుడు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకూ నగర వాతావరణం ఉపశమనం కలిగిస్తుందన్న ప్రతీతి ఉండేది. కానీ ఈ పరిస్థితిని మనమే చేజేతులా దూరం చేసుకుంటున్నాం. శరవేగంగా రహదారుల విస్తరణ, బహుళఅంతస్తుల భవంతులు, వాణిజ్య సముదాయాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా..గ్రీన్‌టాప్‌ అంతకంతకూ పెరగకపోవడంతో మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న గ్రీన్‌హౌజ్‌ వాయువులైన కార్బన్‌డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి వాయువుల ఉద్గారాలు పెరిగి వేసవి తాపం ఉక్కిరిబిక్కిరిచేస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

ఇలా చేస్తే హరితం పదిలం..  
నగరంలోని ప్రధాన రహదారులు,  చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్‌ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి,పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది.
సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంతవిస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని,ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్‌ ఇచ్చిన తరవాతనే వారికి జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి.
నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్‌ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చేసమయంలో ఈవిషయాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. 

హరితంతో కాలుష్యం దూరం..దూరం..
చెట్ల ఆకులు వాతావరణంలోని కార్భన్‌డయాక్సైడ్, సూక్ష్మధూళి కణాలను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుండడంతో పీల్చేగాలిలో ఆక్సిజన్‌ మోతాదు పెరుగుతుంది. చెట్లు ఎయిర్‌ ఫిల్టర్లుగా పనిచేస్తాయని అందరూ గ్రహించాలి. చెట్లు చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా విద్యుత్‌ వంటి ఇంధనాన్ని ఆదాచేస్తాయి. కాలుష్య ఉద్గారాలను బాగా తగ్గిస్తాయి.

పట్టణీకరణతో జలవనరులకు శాపం..
మహానగరంలో చెరువులు, కుంటలకు పట్టణీకరణ శాపంగా పరిణమిస్తోంది. ఔటర్‌రింగ్‌ రోడ్డుకు లోపలున్న సుమారు 3000 చెరువులు, కుంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. ఇవి 2005లో సుమారు 30,978 ఎకరాల్లో ఉండేవి. ఆ తర్వాత రియల్‌రంగం పురోగమించడం, పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి ఉద్యోగాలు, వ్యాపారాల కోసం సిటీకి వలసలు అధికమవడంతో శివార్లలో భూములకు డిమాండ్‌ బాగా పెరిగింది. దీంతో ఒకప్పుడు పచ్చటి పంటపొలాలు, నిండుకుండలను తలపించే చెరువులు, కుంటలతో కళకళలాడిన ప్రాంతాలు ఇప్పుడు కాంక్రీట్‌ మహారణ్యంగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా జలవనరుల విస్తీర్ణం ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టి 5,641 ఎకరాలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. అంటే గత 13 ఏళ్ల కాలంలో సుమారు 80 శాతం మేర వీటి విసీ ్తర్ణం తగ్గుముఖం పట్టడం గమనార్హం.  ఇదే సమయంలో 2005–18 మధ్యకాలంలో ఆయా శివారు ప్రాంతాల్లో కాంక్రీట్‌ మహారణ్యం 1,72,970 ఎకరాల నుంచి 1,97,954 ఎకరాలకు పెరగడం గమనార్హం.

నేల కాలుష్యం:బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్‌ కంపెనీల నుంచి వెలువడుతోన్న ఘన, ద్రవ కాలుష్య ఉద్గారాలను బహిరంగప్రదేశాల్లో పడవేస్తుండడంతో ఆయా ఉద్గారాల్లోని భారలోహాలు, మూలకాలు వర్షంపడినపుడు నేలలోపలికి ఇంకుతున్నాయి. ప్రధానంగా మెర్క్యురీ, లెడ్, క్రోమియం, ఆర్సినిక్, నికెల్, మాంగనీస్, కాపర్, కోబాల్ట్‌ వంటి మూలకాలుండడం  విశేషం.

మెర్సర్‌ ర్యాంకింగ్‌లోగ్రేటర్‌ బెటర్‌
మెర్సర్స్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ర్యాంకింగ్స్‌– 2018 ప్రకారం..హైదరాబాద్‌ నగరం వరుసగా నాలుగో సంవత్సరం మెరుగైన స్థానంలో నిలవడం విశేషం. విశ్వవ్యాప్తంగా జీవన ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్న 450 నగరాలపై మెర్సర్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో మన దేశంలోని హైదరాబాద్, పుణే నగరాలు 142 వస్థానం దక్కించుకున్నాయి. ఢిల్లీ, ముంబయిల కంటే మన నగరం స్థానమే మెరుగ్గా ఉండడం విశేషం. తక్కువ క్రైం రేటు, విశిష్ట భౌగోళిక పరిస్థితులు, సమశీతోష్ణ వాతావరణం, అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు జీవించేందుకు అనువుగా ఉండడంతో నగరం మెరుగైన ర్యాంక్‌ సాధించడం విశేషం.  

మరిన్ని వార్తలు