పెట్టు‘బడి’ మాసం

8 Jun, 2019 13:02 IST|Sakshi

పాపన్నపేట(మెదక్‌): పాఠశాలలు ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. జిల్లాలో 119 ప్రైవేట్‌ పాఠశాలలుండగా సుమారు 25 వేల మంది విద్యార్థులున్నారు. బడిగంటలు మోగే సమయం దగ్గర పడుతున్న కొద్దీ తల్లిదండ్రుల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ధనవంతులు.. ఉద్యోగులు.. రైతులు .. చిరుద్యోగులు.. మధ్య తరగతి వారంతా ఆంగ్ల మాధ్యమంపై మోజుతో తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలల్లో చదివించడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం అప్పులు చేయడానికి సైతం వెనుకాడడం లేదు. కొంతమందైతే కేవలం పిల్లల చదవుల కోసమే పొలాలు కౌలు కిచ్చి..పెద్ద మనుషులను ఇంటి దగ్గరే వదిలి.. పట్నం వెళ్లి కిరాయి రూములు తీసుకొని నివాసం ఉంటున్నారు.
 
జూన్‌ నెల వచ్చిందంటే గుబులే..
జూన్‌ నెల వచ్చిందంటే చాలు అటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో..ఇటు రైతన్నల్లో ఆందోళన ప్రారంభమవుతోంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఏటా ఫీజులను 10 నుంచి 15 శాతం పెంచుతూ పోతున్నారు. నడక సరిగా రాని చిన్నారిని నర్సరీలో చేర్చాలంటే ఏటా కనీసం రూ.20 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఫీజు రూ.12 వేలు కాకుండా, బుక్స్, బ్యాగ్‌లు, టై, షూ, సాక్స్, యూనిఫాం, చివరకు పుస్తకాలకు వేసే కవర్‌లు కూడా వారి దగ్గరే కొనాల్సి ఉంటుంది. ఇక ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు ఫీజు కింద ఏడాదికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. నాలుగు, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలు బయట కొనే అవకాశం ఉన్నప్పటికీ, పాఠశాలల యాజమాన్యాలు సూచించిన రెడీమేడ్‌ షాప్‌ల్లో వారు చెప్పిన ధరలకే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక 6,8వ తరగతుల నుంచి కొన్ని పాఠశాలలు ఐఐటీ ఫౌండేషన్‌ పేరిట క్లాసులు నడుపుతున్నాయి. ఇవన్నీ కలిపి తల్లిదండ్రులకు తడిసి మోపెడవుతోంది.

మరిన్ని వార్తలు