రైడర్‌గా రైజ్‌..తెరపై క్రేజ్‌

10 Feb, 2018 08:28 IST|Sakshi
దర్శకుడు పూరీతో..

టాలీవుడ్‌లో రాణిస్తున్న నగరవాసి విష్షురెడ్డి  

చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి. నటుడు కావాలనే కోరిక. సినీ రంగంలోకి అడుగు పెట్టాలని, ఓవైపు చదువుకుంటూ మోడలింగ్‌పై దృష్టిసారించాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. బైక్‌ రైడర్‌గానూ గుర్తింపు పొంది, టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. రైడర్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించి... హీరో, విలన్‌గా నటిస్తూ తెరపై దూసుకుపోతున్నాడు నగరవాసి విష్షురెడ్డి.

హిమాయత్‌నగర్‌: విష్షురెడ్డికి చిన్నప్పటి నుంచి బైక్‌ రైడింగ్‌ అంటే పిచ్చి. బెంగళూర్‌లో మోడలింగ్‌ చేస్తుండగా బైక్‌ రైడింగ్‌ పోటీల్లో పాల్గొనేవాడు. 2009లో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘జోష్‌’ సినిమాకు మంచి బైక్‌ రైడర్‌ కావాలని వెతికిన డైరెక్టర్‌... విష్షురెడ్డి గురించి తెలుసుకొని అతనికి అవకాశం ఇచ్చాడు. సినిమా సెకండాఫ్‌లో హీరోతో విష్షురెడ్డి చేసిన బైక్‌ రైడింగ్‌ విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. అలా రైడర్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన విష్షురెడ్డి విభిన్న పాత్రలు పోషిస్తూ కెరీర్‌లో ముందుకెళ్తున్నాడు. 

త్వరలో ‘త్రయం’...  
‘జోష్‌’ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించిన విష్షురెడ్డి.. లవ్‌చేస్తే, నీ జతలేక, త్రయం సినిమాల్లో హీరోగా నటించారు. ఇందులో త్రయం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులోనూ బైక్‌ రైడర్‌గా ప్రేక్షకులను అలరించనున్నాడు. డూప్‌ లేకుండా బైక్‌ రైడింగ్‌ విన్యాసాలు, మార్షల్‌ ఆర్ట్స్‌ చేశానని చెప్పాడు విష్షురెడ్డి.   

ఆకాశ్‌తో విలన్‌గా...  
ఓవైపు హీరోగా నటిస్తూనే విలన్‌ పాత్రలకూ ఓటేస్తున్నాడు విష్షురెడ్డి. ఇందులో భాగంగా ‘పూరీ కనెక్ట్స్‌ సంస్థ’ ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ‘మెహబూబా’ సినిమా నిర్మిస్తున్నాడు. ఇందులో ఆయన తనయుడు ఆకాష్‌ హీరో కాగా, విష్షురెడ్డి విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినమా దాదాపు పూర్తయిందని చెప్పాడు. 

అవకాశాలొస్తున్నాయి..  
ఇప్పటివరకు చేసిన సినిమాలు నాకు సంతృప్తినిచ్చాయి. బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయి. కథలను బట్టి అక్కడా సినిమాలు చేస్తాను.   – విష్షురెడ్డి  

Read latest Tollywood News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా