పట్టణ ఇళ్ల కోసం రూ.404 కోట్లు

14 Aug, 2015 03:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రకటించిన 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన-హౌస్ ఫర్ ఆల్' పథకం కింద తెలుగు రాష్ట్రాల్లో పట్టణ గృహనిర్మాణాల కోసం రూ.404.68 కోట్లు విడుదలయ్యాయి.  ఏపీకి రూ. 225.62 కోట్లు తెలంగాణకు రూ.179.06 కోట్లు విడుదలయ్యాయి. తొలి విడత ఎంపిక చేసిన పట్టణాల్లో నిధుల ద్వారా పేదల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు.


 ఆ పట్టణాలకే మళ్లీ అవకాశం: అందరికీ ఇళ్లు పథకం తొలి విడత కింద తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం, రామగుండం, సిద్దిపేట పట్టణాలను కేంద్రానికి ప్రతిపాదించింది. గత యూపీఏ ప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్‌ఏవై) కింద ఈ పట్టణాలను ఎంపిక చేసి నిధులు సైతం కేటాయించింది. సకాలంలో పనులు చేపట్టకపోవడంతో ఎన్డీయే ప్రభుత్వం ఆ ప్రాజెక్టులతో పాటే ఆర్‌ఏవైను రద్దు చేసింది. అయితే, ఆర్‌ఏవై కింద ఈ పట్టణాల్లో లబ్ధిదారుల ఎంపికపై సర్వేలు చేసి వుండటంతో, ఆ సమాచారాన్నే 'హౌస్ ఫర్ ఆల్'కి వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన పట్టణాల్లో హౌస్ ఫర్ ఆల్ అమలుకు  లబ్ధిదారులను గుర్తించడం కోసం సర్వే చేసేందుకు పురపాలకశాఖ ప్రణాళికలు రచిస్తోంది.
 నోడల్ ఏజెన్సీగా మెప్మా
 రాష్ట్రంలో హౌస్ ఫర్ ఆల్ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) వ్యవహరించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు