విశ్వంలో మరో 100 గ్రహాలు!

11 Jan, 2016 01:47 IST|Sakshi
విశ్వంలో మరో 100 గ్రహాలు!

వాషింగ్టన్: విశ్వంలో ఉన్న ఇతర గ్రహాల అన్వేషణ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్ వ్యోమనౌక కొత్త గ్రహాలను కనుగొంది. వేరే నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న 100కు పైగా గ్రహాలను తన రెండో దశలో కెప్లర్ (కె-2 మిషన్) గుర్తించింది. యాంత్రిక లోపాల వల్ల ఈ కెప్లర్ దారి తప్పింది. కొత్త గ్రహాలు నక్షత్రం చుట్టూ తిరుగుతూ కెప్లర్‌ను దాటినపుడు నక్షత్రాల వెలుగుకు అడ్డు రావడంతో చిన్న మచ్చ ఏర్పడుతుంది. దీన్ని బట్టి అవి ఆ నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలుగా అంచనా వేశారు. 2013 మేలో కెప్లర్‌తో సంబంధాలు తెగాయి. అయితే దీన్ని ఆ తర్వాత శాస్త్రవేత్తలు తిరిగి గుర్తించి, టెలిస్కోప్ సాయంతో వెంబడిస్తున్నారు.

ఈ గ్రహాలతోపాటు మరిన్ని గుర్తించే సామర్థ్యం కె-2కు ఉందని ఇయాన్ క్రాస్‌ఫీల్డ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ కెప్లర్‌ను ప్రయోగించిన మొదటి 80 రోజుల్లో దాదాపు 60 వేల నక్షత్రాలను గుర్తించిందని, 7 వేలకు పైగా వెలుతురు విరజిమ్మే సిగ్నల్స్‌ను కనుగొందని ఆయన తెలిపారు. కొత్త గ్రహాల అన్వేషణ కోసం పాలపుంత మొత్తం గాలించేందుకు కెప్లర్‌ను 2009లో ప్రయోగించారు.

మరిన్ని వార్తలు