చీలిక గ్రూపుగానే కొనసాగింపు

12 Feb, 2016 02:38 IST|Sakshi
చీలిక గ్రూపుగానే కొనసాగింపు

మూడింట రెండొంతుల మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి
* అయినా విలీనమవకుండా చీలిక వర్గంగా కొనసాగే వ్యూహం
* చీలిక వర్గంగా గుర్తించాలంటూ రేపో మాపో స్పీకర్‌కు లేఖ
* రాజీనామా లేఖను వెనక్కి తీసుకోనున్న తలసాని!
* రెండ్రోజుల్లో టీఆర్‌ఎస్‌లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు!
* దాంతో పరిపూర్ణం కానున్న టీఆర్‌ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’
* టీడీపీలో మిగిలేది రేవంత్, గోపీనాథ్, కృష్ణయ్యలే

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అనుకున్నది సాధించింది.

మొత్తం తెలుగుదేశం శాసనసభ్యుల్లో మూడింట రెండొంతుల మందిని చేర్చుకోవడం ద్వారా తన ఆపరేషన్ ఆకర్ష్‌ను దిగ్విజయంగా పూర్తిచేసింది. మూడు రోజుల్లోనే ముగ్గురు ఎమ్మెల్యేలు చేరడం, మరో ఎమ్మెల్యే చేరాలని నిర్ణయం తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ చీలికవర్గం పైచేయి సాధించింది. గతంలో శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లుగా కాకుండా చీలికవర్గంగానే వీరు కొనసాగుతారు.

తాము టీడీపీ నుంచి బయటకు వచ్చామని.. మెజారిటీ సంఖ్యలో ఆ పార్టీని వీడినందున తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని స్పీకర్‌ను కోరుతారు. ప్రత్యేక గ్రూపుగా తాము టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తామని, ప్రభుత్వంలో భాగస్వాములం అవుతామని అనుమతి కోరుతారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తన రాజీనామా లేఖను అధికారికంగానే వెనక్కి తీసుకుంటారు.

ఇక మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, గ్రేటర్ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతారని విసృ్తతంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే వారం ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని.. అదే సమయంలో సండ్ర పార్టీలో చేరుతారని టీఆర్‌ఎస్ ముఖ్యుడొకరు వెల్లడించారు.

ఎమ్మెల్యే గాంధీ మూడు రోజుల కిందే టీఆర్‌ఎస్‌లో చేరాలనుకున్నా... సరైన ముహూర్తం చూసుకుని చేరుతానని చెప్పినట్లు తెలిసింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు. ఈ చేరికలూ పూర్తయితే టీడీపీలో ముచ్చటగా ముగ్గురు రేవంత్‌రెడ్డి (కొడంగల్), గోపీనాథ్ (జూబ్లీహిల్స్), కృష్ణయ్య (ఎల్‌బీ నగర్) మిగులుతారు.
 
చీలికవర్గం నేతగా ఎర్రబెల్లి
టీడీపీ చీలికవర్గానికి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వం వహిస్తారు. త్వరలోనే ఈ చీలిక వర్గం నేతలంతా సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకుంటారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరిన తరువాతా... లేదా మిగతా ఇద్దరు కూడా చేరాక ఏర్పాటు చేసుకుంటారా అన్నదానిపై స్పష్టత లేదని ఆ వర్గాలు తెలిపాయి. సమావేశం ఎప్పుడైనా చీలికవర్గం నేతగా ఎర్రబెల్లినే ఎన్నుకుంటారని, ఆయన టీడీఎల్పీ నేతగా కూడా చేసినందున ఆయనకే అవకాశం వస్తుందంటున్నారు.
 
మంత్రివర్గంలో మరొకరికి చాన్స్
టీడీపీ  చీలికవర్గం నుంచి మంత్రివర్గంలో మరొకరికి అవకాశం లభించనుంది. ఇప్పటికే తలసాని శ్రీనివాసయాదవ్ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా చీలికవర్గంలో సీనియర్ ఎమ్మెల్యేకు అవకాశం కల్పిస్తారు. మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుత మంత్రుల్లో  ముగ్గురు లేదా ఐదుగురికి ఉద్వాసన పలుకుతారని ప్రచారం సాగుతోంది. అలాగే చీలికవర్గ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు