జమ్ముకశ్మీర్ ఉద్రిక్తత: 12ఏళ్ల బాలుడు మృతి

8 Oct, 2016 11:43 IST|Sakshi
జమ్ముకశ్మీర్ ఉద్రిక్తత: 12ఏళ్ల బాలుడు మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో 12ఏళ్ల బాలుడు మృతిచెందాడు. శ్రీనగర్ నగరంలో భారత్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారిపై ఇండియన్ ఫోర్స్ టియర్ గ్యాస్, షార్ట్ గన్ పిల్లెట్స్తో శుక్రవారం కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో సైద్పురా ప్రాంతానికి చెందిన జునైద్ అహ్మద్ భట్ అనే 12ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన ఆ బాలుడు చికిత్స పొందుతూ నేటి ఉదయం మరణించాడు. దీంతో 91 రోజులుగా కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతకర పరిస్థితుల్లో మరణించిన వారి సంఖ్య 91కు చేరింది.
 
కాగ శుక్రవారం జరిగిన డజనుకు పైగా ఈ ఘర్షణల్లో మొత్తం 50మంది గాయపడ్డారు. 10వేలకు పైగా కశ్మీరీలు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు చేపట్టారు. ఆందోళనలు కొంత సద్దుమణగంతో ఇటీవలే శ్రీనగర్ ప్రాంతంలో కర్ఫ్యూను ఎత్తివేశారు. మళ్లీ ఆందోళనకర పరిస్థితులు తలెత్తడంతో నగరంలోని ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూను పోలీసులు కొనసాగిస్తున్నారు. జూలై 9న జరిగిన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈ ఆందోళనలు రేకెత్తాయి.  
మరిన్ని వార్తలు