పోకిమన్ యాపిల్ ను గట్టెక్కిస్తుందా..?

23 Jul, 2016 15:13 IST|Sakshi
పోకిమన్ యాపిల్ ను గట్టెక్కిస్తుందా..?

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పోకిమన్ గో గేమ్ క్రేజ్ టెక్ దిగ్గజం యాపిల్ ను గట్టెక్కిస్తుందా ..? అంటే అవుననే అనిపిస్తోంది. ఈ గేమ్ యాపిల్ కు కాసుల పంట పండిస్తుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  ఇటు గేమింగ్ దిగ్గజం నింటెండోకి రెండింతల మార్కెట్ క్యాపిటలైజేషన్ అందించిన పోకిమన్, టెక్ దిగ్గజం యాపిల్ కు వచ్చే రెండేళ్లలో 3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చనుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

వర్చ్యువల్ కు, రియాల్టీకి, అనుసంధానం చేస్తూ ఈ గేమ్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ గేమ్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని నింటెండో కల్పించింది. అయితే యాపిల్ మాత్రం అదనపు ఫీచర్ల కొనుగోలుతో పోక్ కాయిన్లను ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే యాపిల్ యూజర్లు ఈ కాయిన్లకు కొంత మొత్తం నగదు చెల్లించాల్సి ఉంటుంది. 100 పోక్ కాయిన్స్ ను 99 సెంట్లకు యాపిల్ తన స్టోర్ లో విక్రయిస్తోంది.

ఈ విక్రయంతో పాటు, పోకిమన్ కు పెరుగుతున్న క్రేజ్ యాపిల్ రెవెన్యూలను పెంచుతుందని మార్కెట్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 210లక్షల ప్లేయర్లు అధికమొత్తంలో పోక్ కాయిన్లను యాపిల్ స్టోర్ నుంచి కొనుగోలు చేసినట్టు ఒక బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. అమెరికాలో పోకిమన్ గేమ్ కు 210లక్షల యాక్టివ్ యూజర్లున్నారు. ఈ గేమ్ ను ప్రస్తుతం 35 కి పైగా దేశాల్లో ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్ డివైజ్ లలో ఇది అందుబాటులో ఉంది.

క్యాండీ క్రష్ గేమ్ తో పోలిస్తే, పోకిమన్ గేమ్ కే ఎక్కువమంది యూజర్లు కలిగి ఉన్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్ లపై కంటే కూడా పోకిమన్ గేమ్ పై యూజర్లు ఎక్కువ సమయం వెచ్చించడానికి ఆసక్తి చూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.  అటు ఎలక్ట్రిక్ రిటైలర్లకు ఈ గేమ్ కాసుల పంట పడిస్తోంది. ఈ గేమ్ ఆవిష్కరించనప్పటినుంచి మొబైల్ చార్జర్ల అమ్మకాలు అమాంతం పెరిగాయి.

మరిన్ని వార్తలు