జెండా ఆవిష్కరించిన అటెండర్

27 Jan, 2016 02:24 IST|Sakshi
జెండా ఆవిష్కరించిన అటెండర్

ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశం
మహబూబ్‌నగర్‌టౌన్: జెండా ఆవిష్కరణ సమయం మించిపోవడం.. కమిషనర్ రాకపోవడంతో అటెండర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఘటన మంగళవారం మహబూబ్‌నగర్ మునిసిపల్ కార్యాలయంలో జరిగింది. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఉదయం ఎనిమిది గంటలైనా కమిషనర్ దేవ్‌సింగ్ కార్యాలయానికి రాలేదు. అప్పటికే కౌన్సిల్ సభ్యులు, పుర ప్రముఖులు వచ్చారు. ఆయన వస్తున్నారా.. రారా అన్న సమాచారం కూడా లేదు. చివరికి 8.15 గంటలకు అటెండర్ బుచ్చయ్య జెండా ఆవిష్కరణ చేశారు. అయితే గణతంత్ర దినోత్సవం రోజున అధికారులే జెండావిష్కరణ చేయాల్సి ఉంటుందన్న విషయం తెలిసి కూడా కమిషనర్ సమయానికి రాకపోవడంపై అక్కడున్న పుర ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై కలెక్టర్ టీకే శ్రీదేవి విచారణకు ఆదేశించారు. దీనిపై కమిషనర్ దేవ్‌సింగ్ మాట్లాడుతూ తాను కేవలం ఎస్టీ అధికారిననే దురుద్దేశంతోనే జెండా ఆవిష్కరణలో తనను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అటెండర్‌తో జెండాను ఆవిష్కరింపజేసి సోషల్ మీడియాలో చేసిన ప్రచారం తనను కలచి వేసిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని కమిషనర్ తెలిపారు.

మరిన్ని వార్తలు