అక్కడ ఐదేళ్ల పాటు బీబీసీపై నిషేధం!

28 Feb, 2017 09:18 IST|Sakshi
అక్కడ ఐదేళ్ల పాటు బీబీసీపై నిషేధం!
భారతదేశంలోని ఏ జాతీయ పార్కు వద్దకు బీబీసీ గానీ, అందులో పనిచేసే జర్నలిస్టు జస్టిన్ రౌలత్ గానీ ఐదేళ్ల పాటు రావడానికి వీల్లేదంటూ నిషేధం విధించారు. అసోంలోని ప్రఖ్యాత కజిరాంగా నేషనల్ పార్కులో భారత్ చేపడుతున్న జంతువుల రక్షణ చర్యలను ప్రశ్నిస్తూ బీబీసీ తీసిన డాక్యుమెంటు అత్యంత దారుణంగా ఉండటంతో జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌సీటీఏ) ఈ చర్యలు తీసుకుంది. 
 
''వన్ వరల్డ్: కిల్లింగ్ ఫర్ కన్జర్వేషన్'' అనే శీర్షికతో బీబీసీకి చెందిన దక్షిణాసియా కరస్పాండెంట్ జస్టిన్ రౌలత్ ఓ డాక్యుమెంటరీ తీశారు. అందులో కజిరాంగా నేషనల్ పార్కులో ఖడ్గమృగాల పరిరక్షణ చర్యలు ఘోరంగా ఉన్నాయంటూ తీవ్రంగా విమర్శించారు. ఇదంతా తప్పుడు నివేదిక అని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మండిపడింది. ఖడ్గమృగాలకు ముప్పు తలపెడతున్నారని భావించిన ఎవరినైనా కాల్చి చంపేందుకు ఫారెస్టు గార్డులకు అధికారాలు ఇచ్చారని, ఇది ఆటవికమని ఆ డాక్యుమెంటరీలో పేర్కొన్నారు. 
 
ఇలాంటి డాక్యుమెంటరీలను ప్రసారం చేయడానికి ముందే తప్పనిసరిగా ఎంఓఈఎఫ్‌సీసీ, కేంద్ర విదేశాంగ శాఖలకు చూపించి అనుమతి తీసుకోవాలని, కానీ బీబీసీ అలా చేయలేదని ఎన్‌సీటీఏ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని రక్షిత ప్రాంతాలలో ఎక్కడికీ బీబీసీ వాళ్లు ఐదేళ్ల పాటు రాకుండా చూడాలని ఆదేశాలు జారీచేశారు. టైగర్ రేంజిలు, టైగర్ రిజర్వులు ఉన్న అన్ని రాష్ట్రాలకు ఈ వర్తమానం పంపారు.
మరిన్ని వార్తలు