9 రెట్ల తక్కువ ధరకే క్యాడిలా క్యాన్సర్ ఔషధం

22 Nov, 2013 01:09 IST|Sakshi

 న్యూఢిల్లీ: క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ  తొమ్మిది రెట్ల తక్కువ ధరకే లభించే ఊపిరితిత్తుల(లంగ్) క్యాన్సర్ ఔషధాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే  మైసిడాక్-సి ఔషధాన్ని రూ. 40,000కే (10 కోర్సుల ఇంజెక్షన్) అందిస్తున్నామని క్యాడిలా కంపెనీ సీఎండీ రాజీవ్ ఐ మోడి గురువారం తెలిపారు. బహుళజాతి కంపెనీలు అందించే ఈ రకం ఔషథాల ధరలతో పోల్చితే దీని ధర తొమ్మిది రెట్లు తక్కువని పేర్కొన్నారు.

రోచె కంపెనీ అవాస్టిన్ ఔషధాన్ని ఒక్క కోర్సు ఇంజెక్షన్‌ను రూ.37,000కు విక్రయిస్తోందని వివరించారు.  15 సంవత్సరాలు పరిశోధన చేసి ఈ ఔషథాన్ని రూపొందించామని, భారత్‌తో పాటు ఆఫ్రికా, నైరుతి ఆసియా దేశాలతో సహా మొత్తం 50 దేశాల్లో ఈ ఔషధాన్ని విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. విదేశాల్లో విక్రయాల కోసం తగిన భాగస్వాముల కోసం చూస్తున్నామని తెలిపారు. ఈ ఔషధానికి డ్రగ్  కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందామని, వచ్చే నెల మొదటివారంలో భారత్‌లో విక్రయాలు ప్రారంభిస్తామని వివరించారు. అహ్మదాబాద్ సమీపంలోని క్యాడిలా ధోల్క ప్లాంట్‌లో ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నామని వివరించారు.
 

మరిన్ని వార్తలు