కాంగ్రెస్‌లో ‘ప్రధాని’ కలకలం

11 Jan, 2014 03:14 IST|Sakshi

అభ్యర్థి వెల్లడిపై భిన్నాభిప్రాయాలు!
రాహులే మా ‘సహజ ఎంపిక’: షిండే
ముందుగా ప్రకటించడమెందుకు: దిగ్విజయ్

 
 న్యూఢిల్లీ: ప్రధాని అభ్యర్థి అంశం కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలకు, అభిప్రాయ భేదాలకు వేదికగా మారుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని వీలైనంత త్వరగా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేయాలని పార్టీలో మెజారిటీ వర్గం కొంతకాలంగా పదేపదే డిమాండ్ చేస్తున్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం మీడియాముఖంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకోవైపు ప్రధాని అభ్యర్థిగా రాహులే తమ సహజ ఎంపిక అని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అభిప్రాయపడ్డారు! శుక్రవారం హోం శాఖ నెలవారీ మీడియా భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 17న జరిగే ఏఐసీసీ సదస్సులో రాహుల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించే అవకాశముందా అని ప్రశ్నించగా, తమ పార్టీకే గాక దేశానికి కూడా ఆయన అవసరమన్నారు.
 
 నేతల మధ్య పోటీ కాదు
 ప్రధాని అభ్యర్థి ఎంపికపై జాగరూకత అవసరమని దిగ్విజయ్ అన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికల్లో గెలిచిన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధు లు మాత్రమే తమ నాయకుడిని ఎన్నుకుంటారని గుర్తు చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానితో పాటు షాడో ప్రధాని, అంటే విపక్ష నేత కూడా ఉంటారని దిగ్విజయ్ అన్నారు. ప్రధానిగా మోడీ, రాహుల్, కేజ్రీవాల్‌లపై జరుగుతున్న చర్చను వార్తా చానళ్ల టీఆర్పీ ప్రయాసగా కొట్టిపారేశారు. భారత్ వంటి దేశంలో పోటీ ఎప్పుడూ పార్టీల సిద్ధాంతాలు, విధానాల మధ్యే ఉంటుంది తప్ప కీలక నేతల మధ్య కాదన్నారు. రాహుల్‌ను ప్రధానిగా చూడాలనుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఇటీవల పలు సర్వేలు వెల్లడిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే, తమ పార్టీ గనుక ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలనుకుంటే అందులో తప్పేమీ లేదంటూ ఆయన ముక్తాయించారు.

మరిన్ని వార్తలు