పాక్‌లో ఆత్మాహుతి దాడి : 70 మంది మృతి

17 Feb, 2017 07:06 IST|Sakshi
పాక్‌లో ఆత్మాహుతి దాడి : 70 మంది మృతి

సింధ్‌లోని ప్రార్థనా స్థలంలో ఆత్మాహుతి దాడి
బాధ్యులుగా ప్రకటించుకున్న ఐసిస్‌  


కరాచీ:ఆత్మాహుతి బాంబు పేలుడుతో పాకిస్తాన్  నెత్తురోడింది. ఐసిస్‌ ఉగ్రఘాతుకంతో సింధ్‌ రాష్ట్రం సెహ్వాన్  పట్టణం రక్తసిక్తమైంది. గురువారం సాయంత్రం పట్టణంలోని ప్రసిద్ధి చెందిన లాల్‌ షాబాజ్‌ ఖలందర్‌ సూఫీ ప్రార్థనా మందిరంలో ఐసిస్‌ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో 70 మంది మరణించగా, మరో 150 మందికి పైగా గాయపడ్డారు. వారం రోజుల వ్యవధిలో పాకిస్తాన్ లో ఐదు బాంబు పేలుళ్లు జరగగా... ఇదే అత్యంత తీవ్రమైంది. మృతుల్లో పలువురు చిన్నారులు, మహిళలు ఉన్నారని, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో ప్రమాద స్థలం భీతావహ వాతావరణాన్ని తలపించిందని సీనియర్‌ ఎస్పీ తారిఖ్‌ విలాయత్‌ చెప్పారు.

12వ శతాబ్దికి చెందిన సూఫీ మతగురువు లాల్‌ షాబాజ్‌ ఖలందర్‌ పేరుమీదుగా నిర్మించిన ప్రార్థనా స్థలంలో వందల మంది భక్తులు గుమిగూడి ఉన్న సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ప్రార్థనా మందిరంలోని బంగారు ద్వారం గుండా లోనికి ప్రవేశించిన దుండుగుడు... సూఫీ నృత్యం ‘ధామల్‌’ ప్రదర్శించే చోట ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. భక్తుల్ని భయభ్రాంతుల్ని చేసేందుకు ముందుగా గ్రనేడ్‌ విసిరి అనంతరం పేల్చుసుకున్నాడని సెహ్వాన్  పోలీసులు తెలిపారు.

ఈదీ ఫౌండేషన్ కు చెందిన ఫైసల్‌ ఈదీ మాట్లాడుతూ... హైదరాబాద్, జమ్‌షోరో ఆస్పత్రులకు 60కిపైగా మృతదేహాల్ని తరలించామని వెల్లడించారు. సింధ్‌ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ప్రమాద స్థలం 130 కి.మి. దూరంలో ఉన్నప్పటికీ వెంటనే అంబులెన్స్ లు, వైద్య బృందాల్ని పంపామని నగర కమిషనర్‌ కాజీ షాహిద్‌ చెప్పారు. సహాయ కార్యక్రమాల కోసం ఆస్పత్రుల వద్ద అత్యవసర పరిస్థితి విధించామని ఆయన తెలిపారు. 

సహాయ కార్యక్రమాల కోసం సైన్యం సాయం అర్థించామని, ప్రార్థనా మందిరం రాజధానికి దూరంగా ఉండడంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందని సింధ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి సయెద్‌ మురాద్‌ అలీషా పేర్కొన్నారు. బాంబు దాడిని తీవ్రంగా ఖండించిన పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌... ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.  శాంతి భద్రతలకు ముప్పుగా తయారైన ఉగ్రవాద శక్తుల్ని నిర్మూలిస్తామంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడింది తామేనంటూ ఐసిస్‌ పేర్కొన్నట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది. షియా వర్గం లక్ష్యంగా ఉగ్రదాడి చేసినట్లు తెలుస్తోంది.