రాష్ట్రం.. విత్తన భాండాగారం

8 Jan, 2016 02:58 IST|Sakshi
రాష్ట్రం.. విత్తన భాండాగారం

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/గజ్వేల్: నాణ్యమైన విత్తనాలను రూపొందించడానికి అవసరమైన నేలలు, వాతావరణం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఉందని, తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే విత్తన భాండాగారంగా ఆవిర్భవించబోతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో రూ.1,823 కోట్ల వ్యయంతో హార్టికల్చర్ యూనివర్సిటీ, రూ.50 కోట్ల వ్యయంతో అటవీ కళాశాల, మరో రూ.30 కోట్ల వ్యయంతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (ఫల పరిశోధన కేంద్రం) నిర్మాణ పనులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు.

అంతకుముందు వారు 18 కంపెనీలు ఏర్పాటు చేసిన ఉద్యాన పంటల స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యాన పంటలకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. దక్షిణ భారత దేశంలోనే రెండో హార్టికల్చర్ యూనివర్సిటీ తెలంగాణలో ఏర్పాటు చేయడంతో ఇక్కడి పంటలపై అద్భుతమైన ప్రయోగాలు జరుగుతాయన్నారు. పండ్లు, పూలు, కూరగాయల సాగు మరింత విస్తరిస్తుందని చెప్పారు.  హైదరాబాద్‌కు కావాల్సిన కూరగాయలను ఇక్కడి నుంచే సరఫరా చేయగలుగుతారన్నారు.
 
గోదాముల నిర్మాణానికి అనుమతులివ్వండి
తెలంగాణలో ప్రస్తుతం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. మరో 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముల నిర్మాణానికి కేంద్ర సహాయం చేయాలని కోరారు. కరువుతో అల్లాడుతున్న తెలంగాణ రైతాంగానికి సముచిత పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీని వేగంగా నిర్మించడానికి అవసరమైన నిధులను విడుదల చేయాలన్నారు.
 
ప్రతి చేనుకు నీరందించడమే మోదీ సర్కార్ లక్ష్యం: రాధామోహన్ సింగ్
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి చేనుకు నీరందించడమే లక్ష్యంగా మోదీ సర్కార్ ముందుకు సాగుతోందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందించడానికి ఈ-మార్కెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. దేశంలోని 550 ప్రముఖ మార్కెట్లను ఈ విధానంతో అనుసంధానం చేస్తామన్నారు. వారం, పది రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కరువు సహాయం అందజేస్తామని ప్రకటించారు.  

వ్యవసాయరంగంలో సంస్కరణలు తీసుకురానున్నట్లు చెప్పారు. వ్యవసాయరంగాభివృద్ధి కోసం ఆర్‌కేవీవై (రాష్ట్రీయ కృషి వికాస్ యోజన), పీకేవీవై (పరంపరగత్ కృషి వికాస్ యోజన) పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, టి.హరీష్‌రావు, ఐసీఐఆర్ చైర్మన్ అయ్యప్పన్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
నిరుద్యోగుల నినాదాలు
ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సభా ప్రాంగణంలో నిరుద్యోగ యువ కులు నినాదాలు చేశారు. సభలో కేసీఆర్ ప్రసంగం చివరి దశకు చేరుకున్న తరుణంలో యువకులు తాము కూర్చున్న చోటు నుంచే.. ‘ఉద్యోగాలు లేని చదువులెందుకు..? నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి’ అంటూ నినదించారు. కొందరు యువకులు కుర్చీలపై నిలబడి గట్టిగా అరవడానికి ప్రయత్నించారు.

మరిన్ని వార్తలు