సీవీసీగా కేవీ చౌదరి

9 Jun, 2015 02:58 IST|Sakshi
సీవీసీగా కేవీ చౌదరి

సీఐసీగా విజయ్ శర్మ నియామకం
న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ చీఫ్ కేవీ చౌదరిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా విజయ్ శర్మను నియమించింది. గతవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నియామకాల కమిటీ వీరిద్దరి పేర్లను ఖరారు చేయడం తెలిసిందే.

వీరి నియామకాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారని రాష్ట్రపతి భవన్ ప్రతినిధి తెలిపారు. వీరిద్దరితో పాటు ఇండియన్ బ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ టీఎం భాసిన్‌ను విజిలెన్స్ కమిషనర్‌గా, సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి సుధీర్ భార్గవను సమాచార శాఖ కమిషనర్‌గా నియమించారు. అవినీతి నిఘా విభాగాల్లో కీలకమైన సీవీసీ పదవికి ఒక ఐఏఎస్ అధికారి కాని వారిని నియమించడం 1964 నుంచి ఇదే మొదటిసారి.

ఇక సీఐసీ నియామకంలో సమాచార కమిషనర్లలో ఎక్కువ సీనియారిటీ ఉన్న కమిషనర్‌ను నియమించాలనే సంప్రదాయాన్ని ప్రభుత్వం పాటించింది. 2014 ఆగస్టు 22న సీఐసీ రాజీవ్ మాథుర్ పదవీకాలం ముగిసినప్పటి నుంచీ కూడా ప్రభుత్వం ఆ ఖాళీని భర్తీ చేయలేదు. ప్రధాన కమిషనర్ లేకుండా సీఐసీలో విచారణకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న కేసులు 40,051 ఉన్నాయి. కాగా సీఐసీలో ఖాళీగా ఉన్న మూడు కమిషనర్ల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.
 
కురుముద్దాలి నుంచి ఢిల్లీ దాకా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులైన కొసరాజు వీరయ్య చౌదరి కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి గ్రామానికి చెందినవారు.  1954 అక్టోబర్ 10న జన్మించారు. తండ్రి కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు మచిలీపట్నంలో అడ్వకేట్‌గా పనిచేశారు. కేవీ చౌదరి ఇంటర్ వరకు కృష్ణా జిల్లాలోనే చదువుకున్నారు. బీఎస్‌సీ మేథమేటిక్స్ చెన్నైలోని లయోలా కాలేజీలో, ఎమ్మెస్సీ మేథమేటిక్స్ ఐఐటీ చెన్నైలో చదివారు.

1978 బ్యాచ్ ఐఆర్‌ఎస్‌కు చెందిన ఈయన కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం చైర్మన్‌గా పనిచేశారు.. బ్లాక్‌మనీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందంలో సభ్యుడిగా కూడా చౌదరి పనిచేశారు. ఈయన టూజీ కేసు విచారణలోనూ కీలక అధికారిగా పనిచేశారు. సీబీడీటీ ఇన్వెస్టిగేషన్, ఆడిట్ అండ్ జుడీషియల్ విభాగాల్లో సభ్యుడిగా ఉన్నారు.  కేవీ చౌదరి దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిన్నమనేని కోటేశ్వరరావు అల్లుడు.

మరిన్ని వార్తలు