తొలి మారుతిని కొంటానంటున్న మమ్ముట్టి

28 Apr, 2015 19:00 IST|Sakshi
తొలి మారుతిని కొంటానంటున్న మమ్ముట్టి

మొట్టమొదటి మారుతి 800 కారు ఈ మధ్యే మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అది యజమాని ఇంటి బయట తుక్కులా పడి ఉన్న విషయం మీడియాలో ప్రముఖంగా ప్రచారమైంది. ఆ కారును కొనాలని మళయాళ సూపర్స్టార్ మమ్ముట్టి భావిస్తున్నారు. తన మొదటి కారు కూడా మారుతీయేనని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన పలు లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. వాటిలో బీఎండబ్ల్యులు, జాగ్వార్ కార్లు కూడా ఉన్నాయి. అయినా కూడా దేశంలో ఉత్పత్తి అయిన మొట్టమొదటి మారుతి కారు కావడంతో దాన్ని కొనాలని ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు.

అయితే మమ్ముట్టితో పాటు మరికొందరు కూడా ఈ కారును కొనాలని ఉత్సాహం చూపిస్తున్నారు. హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం యజమాని, ప్రముఖ క్విజ్ మాస్టర్ డెరిక్ ఓబ్రెయిన్, ఇంకొంతమంది కూడా ఈ కారుపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కారు యజమాని అయిన హర్పాల్ సింగ్ కుటుంబం మాత్రం.. కారును కంపెనీకే ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. 32 ఏళ్ల క్రితం లక్కీడ్రాలో ఈ మొట్టమొదటి మారుతి కారు ఆయనకు దక్కింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా ఆయనకు ఈ కారు తాళాలు అందించారు.

మరిన్ని వార్తలు