నెలరోజుల్లోనే మంత్రి పదవికి రాజీనామా

15 Apr, 2017 20:00 IST|Sakshi
నెలరోజుల్లోనే మంత్రి పదవికి రాజీనామా

ఇంఫాల్‌: మణిపూర్‌లో బీజేపీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌పై అసంతృప్తితో సీనియర్‌ మంత్రి ఎల్‌ జయంత్‌ కుమార్‌ రాజీనామా చేశారు. తన శాఖలో సీఎం మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని, అందుకే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖతో సహా మూడు కీలకమైన శాఖలు నిర్వహించేవారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీరెన్‌ సింగ్‌ ఢిల్లీ పయనమయ్యారు.

మార్చి 15న బీరెన్‌, ఆయన మంత్రి వర్గ సభ్యులు ప్రమాణం చేశారు. మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను... కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 స్థానాలు వచ్చాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్‌లు చెరో నాలుగు సీట్లు గెలుచుకున్నాయి.  ఎల్‌జేపీ, టీఎంసీ చెరోక సీటు, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్‌, ఎల్‌జేపీ, టీఎంసీ మద్దతును కూడగట్టి... బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జయంత్‌ కుమార్‌ ఎన్‌పీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్‌పీపీకి చెందిన మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినా వారు తమ శాఖల పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
 

మరిన్ని వార్తలు