నరేంద్ర మోడీకి యుఎస్ ప్రశంసలు

29 Jul, 2014 21:23 IST|Sakshi
జాన్ కెర్రీ - నరేంద్ర మోడీ

 వాషింగ్టన్:  అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రణాళిక ఆయన ఎన్నికల నినాదంలోనే ప్రతిఫలించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ అన్నారు. ’అందరితో కలసి, అందరి అభివృద్ధి కోసం’ (సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్) అన్న నినాదం ఎంతో దార్శనికతతో కూడుకున్నదని ఆయన ప్రశంసించారు. మంగళవారం భారత్ పర్యటనకు బయలుదేరుతున్న సందర్భంగా జాన్ కెర్రీ వాషింగ్టన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య జరగనున్న ఐదవ వార్షిక వ్యూహాత్మక చర్చలకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కలసి ఆయన అధ్యక్షత వహించనున్నారు.

భారత పర్యటనకు కెర్రీ  బయలుదేరే సమయంలో  నరేంద్ర మోడీ అభివృద్ధి అజెండాపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌లో మోడీ నేతత్వంలోని కొత్త ప్రభుత్వం కృషిలో భాగస్వామి అయ్యేందుకు అమెరికా సంసిద్ధంగా ఉందని  స్పష్టంచేశారు. మోడీ ప్రభుత్వ అభివృద్ధి నినాదానికి తాము మద్దతు ఇస్తున్నామన్నారు.  భారత్ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవంలో అమెరికా ప్రైవేటు రంగం ప్రోత్సాహకారిగా పనిచేస్తుందని చెప్పారు.

అమెరికన్ ప్రోగ్రెస్ సెంటర్ ఆధ్వర్యంలో వాషింగ్టన్‌లో జరిగిన కార్యక్రమంలో కెర్రీ ప్రసంగిస్తూ, వస్తుతయారీ, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య రక్షణ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ తదితర రంగాల్లో భారత్ అభివృద్ధి కోసం అమెరికా కంపెనీలు సహకరిస్తాయన్నారు.  పొరుగు దేశాలతో సంబంధాల మెరుగుదల కోసం నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలపై కూడా కెర్రీ ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పిలవడం, ఉభయదేశాల మధ్య సంబంధాల మెరుగుపరిచే దిశగా మోడీ చేపట్టిన మొదటి చర్యగా అభివర్ణించారు. ఉభయదేశాల శ్రేయస్సు, సుస్థిరత కోసం భారత్, పాకిస్థాన్ కలసి పనిచేసేలా అమెరికా అన్నివిధాలా సహాయం అందిస్తుందని కెర్రీ చెప్పారు.

>
మరిన్ని వార్తలు