‘26/11’పై విచారణ ఏదీ?

25 Oct, 2013 07:38 IST|Sakshi
‘26/11’పై విచారణ ఏదీ?

వాషింగ్టన్: కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోండని అడగడానికి వచ్చిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి అనుకోని ప్రశ్నలు ఎదుర్కోవలసి వచ్చింది. 2008 ముంబై దాడుల నిందితులపై విచారణ ఎందుకు ప్రారంభించలేదని షరీఫ్‌ను ఒబామా నిలదీశారు. అంతేకాక సీమాంతర తీవ్రవాదం, ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా కార్యకలాపాలపై ఆరా తీశారు. వైట్‌హౌస్‌లో ఒబామాను కలిసి రెండు గంటలు చర్చించిన అనంతరం ఈ విషయాల్ని నవాజ్ షరీఫ్ వెల్లడించారు. భారత్‌తో సంబంధాలు, కాశ్మీర్ అంశం కూడా తమ మధ్య చర్చకు వచ్చిందని షరీఫ్ తెలిపారు.
 
  26/11 ముంబై దాడుల నిందితుల విచారణ జాప్యంపై, ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ తెలిపిన తర్వాత నిర్బంధంలో ఉన్న డా. షకీల్ ఆఫ్రిదీ గురించి కూడా ఒబామా ప్రశ్నించినట్లు షరీఫ్ తెలిపారు. కానీ ఇతర వివరాలు బహిర్గతం చేయలేదు. అనంతరం ఒబామా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడడానికి షరీఫ్ విజ్ఞతతో అడుగులు వేస్తున్నారని కొనియాడారు. ఆయుధ కొనుగోలుకు వినియోగించే నిధుల్ని సామాజిక అభివృద్ధికి ఖర్చు చేస్తే ఉపఖండంలో శాంతి నెలకొంటుందని ఒబామా అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద నిర్మూలనకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడానికి అంగీకరించామన్నారు. చర్చల అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దక్షిణాసియాలో నిలకడైన అభివృద్ధి సాధించడానికి అన్ని పక్షాలు నిరంతరాయంగా కృషి చేయాలని ఇరు దేశాలు తీర్మానించాయి. అయితే అమెరికా ద్రోన్ దాడులు, కాశ్మీర్ సమస్యపై మాత్రం ఒబామా నుంచి ఏవిధమైన హామీ షరీఫ్‌కు దక్కలేదని తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు