పరిస్థితులు అనుకూలించకే టీవీ9 ఎగ్జిట్‌లో జాప్యం

10 Oct, 2013 01:16 IST|Sakshi
పరిస్థితులు అనుకూలించకే టీవీ9 ఎగ్జిట్‌లో జాప్యం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే మీడియా కంపెనీ టీవీ9 గ్రూప్ మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఏబీసీఎల్) నుంచి వైదొలగడంలో జాప్యం జరుగుతోందని వెంచర్ క్యాపిటలిస్ట్, పీపుల్ క్యాపిటల్ ఎండీ శ్రీని రాజు చెప్పారు. ప్రస్తుతం ఈ సంస్థలో తమతో పాటు మరికొందరు ఇన్వెస్టర్లకు సుమారు 80 శాతం వాటాలు ఉన్నాయని వివరించారు. మొత్తం మీద ఇందులో రూ. 100 కోట్ల దాకా ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నట్లు పేర్కొన్నారు.
 
 బుధవారం ఇక్కడ జరిగిన ‘టై ఎంట్రప్రెన్యూరియల్ సమిట్’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శ్రీని రాజు ఈ విషయాలు వివరించారు. రుణ సంక్షోభంలో చిక్కుకున్న డెక్కన్ క్రానికల్  హోల్డింగ్స్ వ్యవహారం చాలా సంక్లిష్టమైనదని రాజు చెప్పారు. ఇది తమలాంటి ఇన్వెస్టర్లకు అనువైనది కాదన్నారు. గతంలో ఇన్వెస్ట్ చేసిన కొన్ని సంస్థల నుంచి వచ్చే రెండు, మూడేళ్లలో వైదొలుగుతున్నామని రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశం గడ్డు కాలం ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. భారత ఎకానమీకి అంత మంచిది కాదని చెప్పారు. అయితే, కష్టకాలంలోనే నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని, పేరొందిన అనేక కంపెనీలు ఇలాంటి సమయాల్లోనే ఆవిర్భవించాయని రాజు వివరించారు. పరిస్థితులకు భిన్నంగా ఆర్థిక వ్యవస్థ 7-8 శాతం వృద్ధి సాధిస్తున్న పక్షంలో అందరికీ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆయన చెప్పారు.
 
 ‘టై’ సదస్సు..
 ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తగిన వేదిక కల్పించే ఉద్దేశంతో డిసెంబర్ 18-20 దాకా ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై) సంస్థ 7వ ఎంట్రప్రెన్యూరియల్ సదస్సు (టెస్ 2013) నిర్వహిస్తోంది. అమెరికా, యురప్ సహా పలు దేశాల నుంచి సుమారు 2,000 నుంచి 3,000 మంది పైచిలుకు డెలిగేట్లు, సుమారు 100 మంది ఏంజెల్ ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొంటున్నారని టై హైదరాబాద్ ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం చెప్పారు. ఇలాంటి సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించడం ఇదే ప్రథమమని ఆయన పేర్కొన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. ఇన్వెస్టర్లను కలుసుకునేందుకు, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలపై అవగాహన పెంచుకునేందుకు ఇది తోడ్పడగలదని మురళి వివరించారు.

మరిన్ని వార్తలు