‘పద్మశ్రీ’ని తిరిగిచ్చేసిన రచయిత్రి

14 Oct, 2015 04:00 IST|Sakshi
‘పద్మశ్రీ’ని తిరిగిచ్చేసిన రచయిత్రి

మత అసహనంపై కొనసాగుతున్న రచయితల ఆగ్రహం
♦ అకాడమీ అవార్డ్‌ను వాపస్ చేసిన మరికొందరు సాహిత్యకారులు
♦ రచయితలపై మండిపడ్డ ఆరెస్సెస్; లౌకిక వ్యాధి గ్రస్తులని వ్యాఖ్య
 
 న్యూఢిల్లీ: సమాజంలో పెరుగుతున్న మతపరమైన అసహనం, భావప్రకటన స్వేచ్ఛపై దాడులకు వ్యతిరేకంగా ప్రముఖ సాహిత్యకారుల నిరసనల పర్వం కొనసాగుతోంది. దాద్రీ ఘటన, హేతువాదులు కల్బుర్గి, ధబోల్కర్, పన్సారేల హత్య, తాజాగా సుధీంద్ర కులకర్ణిపై శివసైనికుల దాడి.. తదితర హింసాత్మక ఘటనలపై నిరసనగా తామందుకున్న సాహిత్య పురస్కారాలను తిరిగివ్వడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. మంగళవారం ప్రఖ్యాత పంజాబీ రచయిత్రి దాలిప్ కౌర్ తివానా 2004లో తానందుకున్న పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేశారు.

ముస్లింలపై పెరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. భావ ప్రకటనపై దాడిని ఖండిస్తూ.. కార్ల్ మార్క్స్ రచనల ప్రభావం రష్యా విప్లవంపై గణనీయంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సాహిత్య అకాడమీ అవార్డ్‌ను తిరిగిస్తున్న వారి జాబితాలో కన్నడ రచయిత, హంపీ వర్సిటీ ప్రొఫెసర్ రహమత్ తరికెరి, మరాఠీ రచయిత్రి ప్రాధన్య పవార్, హిందీ అనువాదకుడు చమన్‌లాల్, అస్సాం రచయితలు నిరుపమ బోర్గొహెన్, హోమెన్ బోర్గొహెన్ కూడా చేరారు. కల్బుర్గి, దభోల్కర్, గోవింద్ పన్సారేల హత్య, ఘర్‌వాపసీ, దాద్రీ ఘటన, చర్చ్‌లపై దాడులు, సుధీంద్రపై శివసేన దాడి.. మొదలైన ఘటనలకు నిరసనగా  అవార్డ్‌ను తిరిగివ్వాలని నిర్ణయించుకున్నట్లు తరికెరి తెలిపారు.

ఈ ఘటనలు అసహన సమాజాన్ని రూపొందించే క్రమంలో జరిగినవన్నారు. గత సంవత్సరంన్నరగా సమాజంలో పెరుగుతున్న అసహనం, నియంతృత్వ ధోరణులకు నిరసనగా అవార్డ్‌ను తిరిగిస్తున్నట్లు పవార్ అన్నారు. అకాడమీ అవార్డ్‌తో పాటు తానందుకున్న అన్ని సాహిత్య పురస్కారాలను తిరిగిచ్చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తక్షణమే అకాడమీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ఒరియా రచయిత రాజేంద్ర పాండా డిమాండ్ చేశారు. ఇప్పటివరకు దాదాపు 28 మంది రచయితలు తమ అవార్డ్‌లను వెనక్కివ్వగా, సాహిత్య అకాడమీ అధికార పదవుల నుంచి ఐదుగురు రచయితలు వైదొలగారు.

 మోదీ మాట్లాడాలి.. రష్దీ: అకాడమీ పురస్కారాలను వెనక్కిచ్చేస్తున్న రచయితలకు మద్దతిచ్చిన రచయిత, బుకర్ అవార్డ్ గ్రహీత సల్మాన్ రష్దీని దారుణంగా దూషిస్తూ ట్వీటర్‌లో సందేశాలు వెల్లువెత్తాయి. వాటిపై.. ‘మోదీ మూర్ఖ అభిమానులారా.. మీకో విషయం స్పష్టం చేయాలి. నేను ఏ పార్టీకీ మద్దతివ్వను. భావప్రకటన స్వేచ్ఛను హరించే ఏ చర్యనైనా నిరసిస్తాను. స్వేచ్ఛే నా పార్టీ. మునుపెన్నడూ చూడని క్రూర  హింస భారత సమాజంలోకి చొచ్చుకువస్తోంది. ప్రధాని దేనిపైనైనా   మాట్లాడగలరు. ఈ ఘటనలపైనా మాట్లాడితే బావుంటుంది’ అని అన్నారు.  

 వారు లౌకిక వ్యాధిగ్రస్తులు.. అకాడమీ అవార్డులను రచయితలు తిరిగివ్వడంపై ఆరెస్సెస్ పత్రిక ‘పాంచజన్య’ విమర్శించింది. ‘సెక్యులర్ వ్యాధిగ్రస్తులైన కొందరు రోగులు దేశాన్ని, హిందూత్వాన్ని నాశనం చేసేందుకు చేతులు కలిపారు’ అని పేర్కొంది. ‘సిక్కులను ఊచకోత కోసినవారి నుంచి అవార్డులు అందుకోవడంలో వారికి ఏ సమస్యా లేదం’టూ ఎద్దేవా చేసింది. ఈ లౌకికవాదుల దృష్టిలో హిందువులకు ఎలాంటి మానవహక్కులు ఉండవంటూ ధ్వజమెత్తింది. అకాడమీ అవార్డ్‌లను తిరిగివ్వడంపై మరో ప్రముఖ రచయిత చేతన్ భగత్ స్పందిస్తూ.. అవార్డు స్వీకరించి, తర్వాత తిరిగిచ్చేయడం అవార్డును, న్యాయనిర్ణేతలను అవమానించడమేనన్నారు.

ఇదీ రాజకీయమేనని, ప్రచార యావేనని ఘాటుగా విమర్శించారు. పురస్కారాలను తిరిగిస్తున్న రచయితలు రచనలు చేయడం ఆపేయాలన్న సాంస్కృతిక శమంత్రి మహేశ్ శర్మ వ్యాఖ్యపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమయింది. ఆయన అహంభావానికి అది అద్దంపడుతోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. దాంతో, అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా తానెవరినీ నిరోధించలేనంటూ శర్మ చెప్పారు.  

 పాక్ పాఠాలు అవసరం లేదు: భారత్
 బహుళత్వ సంస్కృతిపై పాకిస్తాన్ నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం తమకు లేదని భారత్ పేర్కొంది. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడాలంటే ఉగ్రవాదానికి దూరంగా ఉండడమే కీలకమంది. కసూరి పుస్తకావిష్కరణకు అడ్డంకులు, పాక్ గాయకుడు గులాం అలీ కచేరీ రద్దు వంటివి  పునరావృతం కావొద్దని పాక్ పేర్కొన్న నేపథ్యంలో భారత్ పై వ్యాఖ్యలు చేసింది.
 
 దాద్రీ స్వల్ప ఘటన: బీజేపీ ఎంపీ
  ‘దాద్రీ స్వల్ప ఘటన’ అని బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ అన్నారు. దాద్రీ వంటి చిన్న ఘటనలను భారత్  చక్కగా హ్యాండిల్ చేయగలదని పేర్కొన్నారు. ప్రభుత్వం ముస్లింలతో పాటు ఇతర మతాల వారి అభిప్రాయాలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ స్వభావాన్ని తెలియజేస్తున్నాయని కాంగ్రెస్ తదితర  విపక్షాలు మండిపడ్డాయి. దాద్రీ చిన్న ఘటన అయితే ఇంకేది పెద్ద ఘటన అని సమాజ్‌వాదీ పార్టీ ప్రశ్నించింది. దీనిపై బీజేపీ క్షమాపణ చెప్పాలంది.
 
 కులకర్ణి మరో కసబ్: శివసేన
 మాతో సమస్య ఉంటే అధికారం నుంచి తప్పుకోవచ్చంటూ బీజేపీకి సలహా
  ముంబై: పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన సుధీంద్ర కులకర్ణిని పాక్ ఉగ్రవాదితో పోలుస్తూ ‘మరో కసబ్’గా శివసేన అభివర్ణించింది. సుధీంద్రపై దాడి విషయంలో సేనను విమర్శించిన  సీఎం ఫడ్నవిస్ మహారాష్ట్రను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారంది. ‘కులకర్ణి లాంటి వాళ్లు ఉగ్రవాదులకంటే ప్రమాదం. దేశాన్ని నాశనం చేయడమే అలాంటివారి లక్ష్యం. అలాంటివారు దేశంలో ఉంటే కసబ్‌లాంటి ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించాల్సిన అవసరం పాక్‌కు ఉండదు’ అని తన పత్రిక ‘సామ్నా’లో విమర్శించింది. కశ్మీర్ వేర్పాటువాదులను ఒక్కటి చేసింది కసూరీనేనంది.

పాక్ నుంచి వచ్చిన కసూరికి భద్రత కల్పించి 26/11 దాడుల్లో మరణించిన అమరవీరులను ఫడ్నవిస్ అవమానించారని సేన ఎంపీ సంజయ్ రౌత్ ఆన్నారు. ‘శివసేన జాతీయవాదం, దేశభక్తితో సమస్య ఉంటే  మహారాష్ట్రలో అధికారంలో నుంచి బీజేపీ తప్పుకోవచ్చ’న్నారు. రాష్ట్రంలో బీజేపీ, సేనల సంకీర్ణం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. సేన విమర్శలపై స్పందిస్తూ.. తాను పాక్ ఏజెంట్‌ను కాదని, శాంతికి ప్రతినిధినని సుధీంద్ర పేర్కొన్నారు. సుధీంద్రపై సిరా దాడి చేసిన ఆరుగురు శివసైనికులను ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే సన్మానించారు.

>
మరిన్ని వార్తలు