అవేం మాటలు!

21 Apr, 2015 03:52 IST|Sakshi
అవేం మాటలు!

ఒక్కరు ముద్దు. ఇద్దరు హద్దు. ఆపై వద్దు.. జనాభా నియంత్రణకు గతంలో సర్కారు ప్రచారం చేసిన స్లోగన్ ఇది. ఏటికేడు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న జనాభాతో భారతావని జనసందాన్ని తలపిస్తోంది. పాపులేషన్ లో చైనా తర్వాత ద్వితీయ స్థానంలో ఉన్న ఇండియా మరో పదేళ్లలో అగ్రస్థానానికి చేరుతుందని ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా మన పాలకుల చెవికెక్కడం లేదు. నానాటికీ ఎగబాకుతున్న జనాభాతో సమస్యలు చుట్టుముడుతున్నా సంకుచిత నేతలకు చీమ కుట్టినట్టైనా లేకపోవడం శోచనీయం. పిల్లల్ని కనండి.. జనాభాను పెంచండి అంటూ స్లో'గన్స్' గురిపెడుతున్నారు.

ఒకరిద్దరితో ఆపొద్దని చంద్రబాబు సెలవిస్తే.. ఇంటికి నలుగురు పిల్లలను కనాలని స్వామిగౌడ్ సూచించారు. కుటుంబ నియంత్రణకు టాటా చెప్పేసి జనాభా పెరుగుదలకు బాటలు వేయాలని హైటెక్ బాబు ఆ మధ్యన పిలుపునిచ్చారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో అవ్వాలని మొదట్లో చెప్పిన మాటను వెనక్కు తీసుకుంటున్నానని జనం సాక్షిగా చేపట్టిన పాదయాత్రలో ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఫ్యామిలీ ప్లానింగ్‌తో ప్రయోజనం లేదని కుండబద్దలు కొట్టారు. హిందూ మత ఉద్ధరణకు పెద్ద ఎత్తున పిల్లలను కనాలని  స్వామిగౌడ్ అభిప్రాయపడ్డారు.

కషాయి పార్టీ నేతలదీ ఇదే మాట. హిందూ మహిళలు ఒక్కొక్కరు కనీసం నలుగురు పిల్లలను కనాలని బీజేపీ సాక్షి మహరాజ్ సలహాయిచ్చారు. నలుగురు పిల్లల్లో ఒకరిని సైన్యానికి పంపాలని, మరొకరిని ఆధ్యాత్మిక గురువులకు ఇవ్వాలని, మిగిలిన వాళ్లను టీచర్లుగా చేయాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు మన నేతాశ్రీల హస్వదృష్టికి దృష్టాంతాలు. అధిక జనాభాతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు జాతి సతమవుతుంటే ఇంకా పాపులేషన్ పెంచాలంటూ పాలకులు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం.

మనదేశంలో ఏటా పెరిగే జనాభా ఆస్ట్రేలియా మొత్తం జనాభా కంటే ఎక్కువగా ఉందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా తయారయిందో అర్థం చేసుకోవచ్చు. స్వాత్రంత్యం సిద్ధించిన నాటికి 30 కోట్లు ఉన్న ఇండియా పాపులేషన్ ప్రస్తుతం 130 కోట్లకు చేరింది. జనాభా పెరుగుదలతో సమస్యలు హెచ్చుతున్నాయి. దారిద్ర్యం, నిరుద్యోగం నానాటికీ పెరుగుతోంది. సమస్యల నుంచి దేశాన్ని బయటపడేయాల్సిన పాలకులు పాపులేషన్ పెంచాలంటూ చేస్తున్న ప్రకటనలు ఎంతవరకు సమంజసమో వారే ఆలోచించుకోవాలి.

మరిన్ని వార్తలు