ఆ విషయంలో హోం మంత్రికి కోపం లేదు

23 Jan, 2017 15:45 IST|Sakshi
ఆ విషయంలో హోం మంత్రికి కోపం లేదు

లక్నో: త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వారసులు బరిలో దిగుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌ బంధుగణం, ఆ పార్టీ సీనియర్ నేతల వారసులతో పాటు బీజేపీ సీనియర్ నేతల వారసులు కూడా రంగంలోకి దిగారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ కుమారుడు పంకజ్ సింగ్‌, బీజేపీ మరో సీనియర్‌ నేత లాల్జీ టాండన్ కొడుకు గోపాల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ నేతల వారసులకు టికెట్లు ఇవ్వడాన్ని ఆ పార్టీ యూపీ వ్యవహారాల ఇంచార్జి ఓం మాధుర్ సమర్ధించుకున్నారు.

నోయిడా నుంచి పంకజ్ పోటీచేస్తున్నారు. బీజేపీ ఇటీవల విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో పంకజ్కు టికెట్‌ దక్కింది. పంకజ్కు గత ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వనందుకు రాజ్నాథ్‌ సింగ్‌ మనస్తాపం చెందారని వచ్చిన వార్తలను మాధుర్‌ తోసిపుచ్చారు. పంకజ్కు టికెట్‌ ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి ఎప్పుడూ అడగలేదని, ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోలేదని,  గతంలో టికెట్‌ ఇవ్వనందుకు కోప్పడ్డారన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. గత 15 ఏళ్లుగా పంకజ్ పార్టీలో పనిచేస్తున్నారని, ఆఫీస్ బేరర్గా ఉన్నారని, ఎన్నికల్లో పోటీచేయడానికి ఆయన 200 శాతం అర్హుడని మాధుర్ అన్నారు. మరో నేత లాల్జీ టాండన్‌ కొడుకు ఇప్పటికే చట్టసభ సభ్యుడిగా ఉన్నారని, మరోసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు