తప్పు జరిగింది.. క్షమించండి!

23 Jun, 2015 05:29 IST|Sakshi
తప్పు జరిగింది.. క్షమించండి!

ఉప రాష్ట్రపతిపై రామ్‌మాధవ్ వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం రాజ్‌పథ్ వద్ద జరిగిన వేడుకల్లో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పాల్గొనకపోవడాన్ని బీజేపీ నేత రామ్ మాధవ్ తప్పుబట్టిన అంశం.. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. దాంతో ఈ వివాదంపై కేంద్రం క్షమాపణలు కోరగా.. బీజేపీ అనుసరిస్తున్న విభజన రాజకీయాలకు రామ్‌మాధవ్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ మండిపడింది. అన్సారీపై రామ్ మాధవ్ చేసిన ట్వీట్లపై కేంద్రం ఆగ్రహంగా ఉందన్న వ్యాఖ్యల నేపథ్యంలో..

‘ప్రధాని ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా రాష్ట్రపతిని కానీ, ఉప రాష్ట్రపతిని కానీ ఆహ్వానించడం ప్రొటోకాల్‌కు విరుద్ధం. ప్రొటోకాల్ ప్రకారం వారిద్దరు ప్రధాని కన్నా పై స్థాయిలో ఉంటారు. అందుకే రాజ్‌పథ్ వద్ద యోగా డే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అన్సారీకి ఆహ్వానం పంపలేదు’ అని సోమవారం కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ వివరణ ఇచ్చారు. అన్సారీని విమర్శించడం తప్పేనని ఒప్పుకుంటూ.. దానికి క్షమాపణలు చెబుతున్నామన్నారు. పొరపాటును రామ్‌మాధవ్ కూడా అంగీకరించారని, క్షమాపణలు చెప్పారని తెలిపారు.

నాయక్ వివరణతో ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నట్లు ఉప రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. ‘నా ట్వీట్‌ను ఉపసంహరించుకున్నాను. అక్కడితో అది ముగిసిపోయింది. లక్షలాది ప్రజలు పాల్గొన్న యోగా దినోత్సవాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి కానీ, ఈ వివాదాన్ని కాదు. దీనిపై మరింత చర్చ అనవసరం’ అని సోమవారం జమ్మూలో రామ్‌మాధవ్ స్పష్టం చేశారు. రామ్‌మాధవ్ వ్యాఖ్యలు బీజేపీ మతతత్వ ధోరణిని తేటతెల్లం చేస్తున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ విమర్శించారు. అన్యాపదేశంగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ.. యోగా ప్రక్రియ అత్యంత పురాతనమైనదని, జనసంఘ్, ఆరెస్సెస్, బీజేపీలకు చెందిన సీనియర్ నేతలు చాలామంది యోగాకు విశేష ప్రాచుర్యం కల్పించారని బీజేపీ నేత అద్వానీ అన్నారు.

>
మరిన్ని వార్తలు