రేపు తీరం దాటనున్న ‘లెహర్’!

27 Nov, 2013 08:31 IST|Sakshi
రేపు తీరం దాటనున్న ‘లెహర్’!

ఉత్తర కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం
వచ్చే 48 గంటల్లో గంటకు 150-200 కి.మీ.ల వేగంతో పెనుగాలులు
 ప్రస్తుతం కాకినాడకు 800 కి.మీ దూరంలో తుపాను

 
 సాక్షి, విశాఖపట్నం:లెహర్ తుపాను మంగళవారం రాత్రి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 800కి.మీ దూరంలో నిలకడగా ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అది ప్రస్తుతం తీవ్ర తుపానుగానే ఉందని, పెనుతుపానుగా నిర్ధారించేది, లేనిది బుధవారం నాటి వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. లెహర్ తుపాను గురువారం సాయంత్రం మచిలీపట్నం, కళింగపట్నం తీరాల మీదుగా కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు. బుధవారం గంటకు 160నుంచి 200కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, గురువారం గంటకు 170నుంచి 200కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 2, 3 మీటర్ల ఎత్తు వరకు ఎగసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, వెళ్లినవారు వెంటనే తిరిగి రావాలని సూచించారు.
 
 రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడొచ్చని, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని, యానాంలోనూ భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించారు.  విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. తుపాను బలపడుతున్న కొద్దీ గుడిసెలు కూలిపోవడం, సమాచార వ్యవస్థ కుప్పకూలడం, రైల్వే ట్రాక్‌లు, రోడ్లు ధ్వంసం అయ్యే అవకాశాలున్నాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా ఉంటేనే మంచిదని సూచించారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు.
 
 మెల్లగా కదులుతూ..!
 లెహర్ తుపాను ప్రస్తుతానికి మెల్లగానే కదులుతోందని అధికారులు చెబుతున్నారు. సోమవారం గంటకు 15 కి.మీ ప్రయాణించి కొద్దిసేపు నిలకడగా ఉంటే మంగళవారం గంటకు 16కి.మీ చొప్పున ప్రయాణించి రాత్రి సమయానికి నిలకడగానే ఉంది. తుపాను మెల్లగా కదులుతుండడం, కొద్దిసేపు నిలకడగా ఉండిపోవడాన్ని బట్టి చూస్తుంటే దాని తీవ్రత అంచనాలకు అందుకోలేని విధంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  
 
 దట్టంగా పొగమంచు: రాష్ర్టంలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కోస్తాంధ్రలో భీమడోలులో 3సెం.మీ, కుప్పం, వెంకటగిరికోట ప్రాంతాల్లో 2సెం.మీ చొప్పున వర్షం కురిసింది. తెలంగాణ సహా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆదిలాబాద్‌లో కనిష్టంగా 17డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రంలోపు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పొగమంచు దట్టంగా కురుస్తుంది.  
 
 ‘ముందస్తు చర్యలు తీసుకున్నాం’
 సాక్షి, హైదరాబాద్ : లెహర్ తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ పార్థసారథి తెలిపారు. బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాసం కోసం ఆర్మీ సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రక్షణ దళానికి చెందిన 4 హెలికాప్టర్లను, 4 కాలమ్స్ (ఒక్కో కాలమ్‌లో 100 మంది) ఆర్మీని తీసుకున్నట్టు చెప్పారు.
 
 రైల్వేశాఖ అప్రమత్తం: లెహర్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందస్తు చర్యలకు నడుం బిగించింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో భేటీ అయి, తాము తీసుకునే చర్యల గురించి వివరించారు. అనంతరం రైల్‌నిలయంలో ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఎంతటి ఉపద్రవం ఎదురైనా ప్రయాణికుల ఇబ్బందులను వీలైనంత తగ్గించేలా చూడాలన్నారు.
 
 28న రైలు ప్రయాణం కష్టమే!
 విశాఖపట్నం, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే అధికారులు అప్రమత్తయ్యారు. రైల్వే ట్రాక్‌లతోపాటు విద్యుత్ ట్రాక్షన్‌పై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటున్నందున రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న రైల్వే ప్రయాణాలు సజావుగా సాగే అవకాశాలుండవని అభిప్రాయపడుతున్నారు.

>
మరిన్ని వార్తలు