ప్రారంభమైన ఆర్మీ ర్యాలీ

5 Feb, 2016 02:14 IST|Sakshi
ప్రారంభమైన ఆర్మీ ర్యాలీ

తొలిరోజు హాజరైన 3,100 మంది యువత
కొత్తగూడెం: తెలంగాణ పది జిల్లాల స్థాయి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో గురువారం ప్రారంభమైంది. ముందురోజు రాత్రే పలువురు అభ్యర్థులు ర్యాలీ నిర్వహించే ప్రాంతాలకు చేరుకోగా, వేకువజామున 3 గంటలకు ఆర్మీ ర్యాలీ ప్రక్రియను ఆర్మీ అధికారులు ప్రారంభించారు. పరుగుపందెంను కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు జెండా ఊపి ప్రారంభిం చారు. తొలిరోజు సోల్జర్ టెక్నికల్ విభాగంలో అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించారు.

ఐదు కేటగిరీల్లోని 780 పోస్టులకుగాను మొత్తం 4,359 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోగా 3,100 మంది హాజరయ్యారు. ఎత్తు, ఛాతీ కొలతలు సరిపోక 200 మందిని తిరస్కరించారు. ఎంపికైన అభ్యర్థులకు పుల్ అప్స్, బ్యాలెన్సింగ్ బీమ్, లాంగ్‌జంప్ పోటీలు నిర్వహిం చారు. అన్ని పోటీల్లో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహిం చనున్నారు. ర్యాలీకి హాజరైన అభ్యర్థులకు అధికారులు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.

అన్ని విభాగాల్లో ఎంపికైన వారికి ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల్లో రెండు బ్యాచ్‌లకు రాతపరీక్షలు నిర్వహిస్తామని, ఏప్రిల్ మొదటి తేదీ నుంచి శిక్షణకు పంపిస్తామని  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ డెరైక్టర్ బ్రిగేడియర్ సంగ్రామ్ దాల్వి చెప్పారు. ఆర్మీ ర్యాలీ ప్రక్రియను సంగ్రామ్ దాల్వితోపాటు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ సికింద్రాబాద్ కల్నల్ ఎ.కె.రోహిల్లా పర్యవేక్షించారు.  
 
నేడు సోల్జర్ క్లర్క్, నర్సింగ్ అసిస్టెంట్ ఎంపిక
రిక్రూట్‌మెంట్ ర్యాలీలో శుక్రవారం సోల్జర్ క్లర్క్, నర్సింగ్ అసిస్టెంట్ విభాగాల్లో ఎంపికలు జరగనున్నాయి. ఈ రెండు విభాగాలకు సంబంధించి 5,596 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వేకువ జామున అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనతో ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో భాగంగా శుక్రవారం నిర్వహించనున్న సోల్జర్ క్లర్క్, నర్స్ అసిస్టెంట్ పోస్టుల ఎంపిక కోసం అభ్యర్థులు గురువారం సాయంత్రం 4 గంటల నుంచే క్యూ కట్టారు.

మరిన్ని వార్తలు