టీడీపీ ఎమ్మెల్యేల తరపున రెండు బదిలీలు

17 Aug, 2015 02:03 IST|Sakshi
టీడీపీ ఎమ్మెల్యేల తరపున రెండు బదిలీలు

టీచర్ల బదిలీల్లో అలా చేస్తే మాకు ఇబ్బందులుండవు: మంత్రి ప్రత్తిపాటి
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రజా ప్రతినిధులుగా తమ రాజకీయ అనుచరులు, అయిన వారికి పనులు చేసి పెట్టాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. రాష్ట్రంలోని ఒక్కో టీడీపీ ఎమ్మెల్యే తరపున ఇద్దరేసి ఉపాధ్యాయులను బదిలీ చేస్తే మంత్రిగా తమకు రాజకీయపరమైన ఇబ్బందులుండవని పేర్కొన్నారు. అలా కాకపోతే తాము కోరిన పనులు చేయడంలేదని ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయే ప్రమాదం ఉందన్నారు.

గుంటూరులో ఏఎస్ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం టెన్త్ ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఈ విషయాలన్నింటినీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేయాలని కోరుతున్న ఉపాధ్యాయులే రాజకీయంగా ఒత్తిడి తెచ్చి అక్రమ పద్ధతుల్లో బదిలీలు అడుగుతున్నారని మంత్రి తెలిపారు.

సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన టీచర్లు బదిలీల కోసం పక్క దారి పట్టవద్దని ఆయన సూచించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, డీఈవో కె.వి.శ్రీనివాసులురెడ్డి, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు