టీ బిల్లుపై చర్చలో పాల్గొనండి: రాహుల్‌గాంధీ

18 Feb, 2014 01:44 IST|Sakshi
టీ బిల్లుపై చర్చలో పాల్గొనండి: రాహుల్‌గాంధీ

* సీమాంధ్ర  కాంగ్రెస్  నేతలకు  రాహుల్‌గాంధీ సూచన
సీమాంధ్రకు న్యాయం చేస్తామని హామీ
* విభజనకే ఒప్పుకున్నాం.. హైదరాబాద్‌ను తాత్కాలిక యూటీ అయినా చేయమని సీమాంధ్ర నేతల విన్నపం
* భేటీలో పాల్గొన్న జీవోఎం సభ్యులు
 
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలకు స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్  కమిటీ తీర్మానానికే కట్టుబడి ఉన్నామన్నారు. వాస్తవాలను అర్థం చేసుకుని విభజనపై పార్లమెంట్‌లో జరిగే చర్చలో పాల్గొని సీమాంధ్రుల సమస్యలను లేవనెత్తాలని వారికి సూచించారు. సోమవారం సాయంత్రం తన నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కిశోర్‌చంద్రదేవ్, కావూరి సాంబశివరావు, ఎం.ఎం.పల్లంరాజు, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, చిరంజీవి, పనబాక లక్ష్మి, ఎంపీలు హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనుమూరి బాపిరాజులతో రాహుల్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిని ఆహ్వానించినా వారు గైర్హాజరయ్యారు. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశానికి జీవోఎం సభ్యులు కూడా హాజరయ్యారు.
 
 సమావేశంలో పాల్గొన్న కొందరు నేతలు చెప్పిన వివరాల ప్రకారం.. రాష్ట్ర విభజనపై లోక్‌సభలో మంగళవారం జరిగే చర్చలో పాల్గొని సీమాంధ్ర సమస్యలను లేవనెత్తాలని సీమాంధ్ర నేతలకు రాహుల్ సూచించారు. వాటి పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని, సీమాంధ్రకు అన్యాయం చేయబోమని హామీ ఇచ్చారు. అదే తనతో పాటు, సోనియాగాంధీ అభిమతమని వెల్లడించారు. అనంతరం జీవోఎంకు తాము గతంలో సమర్పించిన ప్రతిపాదనలను  సీమాంధ్ర నేతలు రాహుల్ ముందుంచారు. మంత్రులు కావూరి, పల్లంరాజు, జేడీ శీలం మాట్లాడుతూ తాము చేసిన విజ్ఞప్తులేవీ జీవోఎం పట్టించుకోలేదని, అలాంటప్పుడు జనంలోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని ప్రశ్నించారు. రాష్ర్ట విభజనకే తాము ఒప్పుకుంటున్నప్పుడు హైదరాబాద్‌ను తాత్కాలిక కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే తప్పేముందని ప్రశ్నించారు.
 
దీంతోపాటు కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరినా పట్టించుకోలేదని వాపోయారు. రాష్ర్టం విడిపోతే సీమాంధ్రలో రెవెన్యూ లోటు తీవ్రమవుతుందని, దీనిని అధిగమించేందుకు హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు వాటా ఇవ్వాలని, సీమాంధ్ర లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు రాయితీలివ్వాలని కోరారు. అనంతరం రాహుల్ జీవోఎం సభ్యుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అయితే హైదరాబాద్‌ను యూటీ చేయడం సాధ్యం కాదని, అలా చేయడానికి రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని తెలిపారు. పైగా ఎంఐఎం పార్టీ  సహా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేలందరూ దీనిని తీవ్రంగా వ్యతిరేకి స్తున్నారని సీమాంధ్ర నేతలకు వివరించారు. అయితే, తాము కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునే వరకే హైదరాబాద్‌ను ఢిల్లీ తరహాలో అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని మాత్రమే కోరుతున్నామని కేంద్ర మంత్రులు చెప్పడంతో..  ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళతానని రాహుల్ హామీ ఇచ్చారు. విడిపోయిన తరువాత సీమాంధ్రకు ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా ప్రత్యేక హోదా కల్పించాలని, తద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఉంటుందని సీమాంధ్ర నేతలు పేర్కొన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజల్లో అత్యధికులు తెలంగాణలో కలవాలని కోరుతున్నందున రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళతానని రాహుల్ వారికి చెప్పారు.
 
 ఆ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తేయండి
 సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని ఆ ప్రాంత నేతలు రాహుల్‌గాంధీకి విజ్ఞప్తి చేశారు. రాష్ర్ట విభజనపై చర్చ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంత ప్రతినిధుల ప్రాతినిధ్యం లేకపోతే అప్రజాస్వామికం అవుతుందని పేర్కొన్నారు. దీనిపై రాహుల్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. సమావేశానంతరం జేడీ శీలం మీడియాతో మాట్లాడుతూ.. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను తాత్కాలిక యూటీ చేస్తే జనంలోకి వెళ్లి వారిని మెప్పించగలమని చెప్పామన్నారు.

>
మరిన్ని వార్తలు