-

పునరావిష్కరించుకోండి

2 Nov, 2015 03:34 IST|Sakshi
పునరావిష్కరించుకోండి

♦ సాహిత్య అకాడమీకి రచయితల వినతి
♦ బీజేపీ తమ వారిని అదుపులో పెట్టుకోవాలని సూచన
 
 న్యూఢిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిని ఖండిస్తూ.. ఇటీవల జరిగిన అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా.. సాహిత్య అకాడమీని పునరావిష్కరించుకోవాలని రచయితలతోపాటు.. అవార్డులను వెనక్కిన వారంతా కోరారు. అకాడమీ రాజ్యాంగంలో చేయాల్సిన మార్పులపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ.. రచయిత్రి నయనతార సెహెగల్  సహా 41 మంది రచయితలు, కళాకారులు అకాడమీకి లేఖ రాశారు. రచయితల నిర్ణయానికి మద్దతుగా అక్టోబర్ 23న అకాడమీ ప్రకటన చేయడం తెలిసిందే. అయితే అకాడమీ నిర్ణయం ఆలస్యంగా వచ్చిందన్న విమర్శలు వచ్చినప్పటికీ.. ఇకనైనా దేశంలోని రచయితల మనోభావాలకు అనుగుణంగా రాజ్యాంగం ఉందా అనే విషయంపై అకాడమీ పునరాలోచన చేయాలని కోరారు.

‘భారత్‌లో పరిస్థితులు చేజారుతున్నాయనే పరిస్థితి కలగొద్దనేదే మా అభిప్రాయం. దేశంలో ఎవరి హక్కులకు భంగం వాటిల్లకూడదు. రోజురోజుకూ దేశంలో కుల వ్యవస్థ మరింత లోతుగా చొచ్చుకు పోతోంది.  దీని వల్లే సమస్యలు వస్తున్నాయి. తాజా పరిస్థితులతో.. దీనిపై చర్చించి పరిష్కరించే అవకాశమే ఉండటం లేదు’ అని ప్రజలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తన మందీ మార్బలాన్ని అదుపులో పెట్టకుండా.. ఈ ఘటనలను ‘కృత్రిమంగా సృష్టిస్తున్న వివాదం’గా పేర్కొనటం సరికాదని విమర్శించారు. కాగా, రచయితలు, మేధావులు అసహనంపై చేస్తున్న ఆందోళనలను రాష్ట్రపతి దృష్టికి తేవడానికి కాంగ్రెస్ చీఫ్ సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ వారంఆయనను  కలవనున్నారు.

మరిన్ని వార్తలు