మదుపరులకిది మంచికాలం..

1 Jun, 2015 04:08 IST|Sakshi
మదుపరులకిది మంచికాలం..

‘సాక్షి’ ఇంటర్వ్యూ యూటీఐ ఫండ్ మేనేజర్ సంజయ్ డోంగ్రే
   ఫెడ్ వడ్డీరేట్లు పెంచితే మరో ఐదు శాతం
    పతనం కావచ్చు
   ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహం కొనసాగుతుంది.
   వచ్చే 18 నెలల్లో వడ్డీరేట్లు 150 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చు
   దీర్ఘ, మధ్యకాలానికి ఆకర్షణీయంగా
    దేశీ స్టాక్ మార్కెట్లు

 
 దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బాగా పెరగటమే కాక ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇది దీర్ఘకాలిక, మధ్యకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలమని చెబుతున్నారు యూటీఐ ఫండ్ మేనేజర్ సంజయ్ డోంగ్రే. కమోడిటీ ధరలు, వడ్డీరేట్లు తగ్గుతుండటం వల్ల కంపెనీల ఆదాయాలు పెరుగుతాయని, ఆ మేరకు స్టాక్ మార్కెట్లు సైతం పరుగులు తీస్తాయని చెబుతున్న సంజయ్‌తో ‘సాక్షి’ పర్సనల్ ఫైనాన్స్ ప్రతినిధి ఇంటర్వ్యూ...
 
 మోదీ ప్రభుత్వ ఏడాది పాలన ఎలా ఉంది? రానున్న కాలంలో మార్కెట్లలో ఎలాంటి సంస్కరణలు రావచ్చు?
 మోదీ ప్రభుత్వం గడిచిన ఏడాదంతా గాడితప్పిన ఆర్థిక, పరిపాలన వ్యవస్థను బాగు చేయడంపైనే దృష్టిపెట్టింది. పాలనలో పారదర్శకత తేవటం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, వ్యాపారానికి సానుకూలమైన దేశంగా తీర్చిదిద్దడం వంటివి దీన్లో కీలకమైనవి. అలాగే కేంద్ర పన్నుల వాటాల్లో రాష్ట్రాల వాటాను 29 నుంచి 39 శాతానికి పెంచారు. బడ్జెట్ కేటాయింపుల్లో రైల్వే, రహదారులు, రక్షణ రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఇక భవిష్యత్తులో తీసుకునే చర్యల విషయానికి వస్తే జీఎస్‌టీ, భూ సేకరణ చట్ట సవరణ, అవినీతి నిరోధక బిల్లులను పార్లమెంటులో ఆమోదింప చేయడం అనేవి కీలకం. ఈ మూడూ ఆమోదం పొందితే మధ్యంతర కాలానికి దేశ ఆర్థిక వృద్ధి రేటు పరుగులు పెడుతుంది.
 
 మంగళవారంనాటి సమీక్షలో ఆర్‌బీఐ ఏ నిర్ణయం తీసుకోవచ్చు? వచ్చే ఏడాది కాలంలో వడ్డీరేట్లు ఏ మేరకు తగ్గొచ్చు?

 వడ్డీరేట్లు 150- 200 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని గత సమీక్షా సమావేశాల్లోనే ఆర్‌బీఐ చెప్పింది. కమోడిటీ ధరలు తగ్గడం, వృద్ధిరేటు స్థిరంగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే 12-18 నెలల కాలానికి వినియోగ ద్రవ్యోల్బణం సగటున 5 శాతంగా ఉండే అవకాశముంది. ఆర్థిక వృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుందని, ముఖ్యంగా తయారీ రంగంలో వృద్ధి ఆశాజనకంగా లేకపోవడంతో వచ్చే 12-18 నెలల కాలంలో వడ్డీరేట్లు 100 - 150 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని అంచనా వేస్తున్నాం.
 
 దేశీయ మార్కెట్లోకి ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహం ఎలా ఉంది? అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచితే అప్పుడెలా ఉండొచ్చు?
 జూన్ తరవాత వడ్డీరేట్లను పెంచే యోచనలో ఫెడ్ ఉంది. ఇదే జరిగితే ఆ భయాలతో ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశముంది. అదే జరిగితే కరెన్సీ ఒడిదుడుకుల్ని అడ్డుకోవటానికి ఆర్‌బీఐ తగు చర్యలు తీసుకుంటుంది. ఇక ఇండియా విషయానికొస్తే ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటున్న దేశం. దానికి తోడు తగ్గుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు వంటివి ఎఫ్‌ఐఐలను ఆకర్షిస్తాయి. ఒకసారి ఫెడ్ వడ్డీరేట్ల భయం తొలిగితే ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకుంటుంది.
 
 బడ్జెట్ పెట్టినప్పటి నుంచీ దేశీ మార్కెట్లు తగ్గుతున్నాయి. ఈ పతనం ఎన్నాళ్లుండొచ్చు? వచ్చే 12-18 నెలల కాలానికి పరిస్థితెలా ఉంటుంది?
 బడ్జెట్ తర్వాత సూచీలు 10 శాతం పతనమయ్యాయి. కంపెనీల ఆదాయాలు నిరాశపర్చడం, అంతర్జాతీయ మార్కెట్లో ప్రధాన కరెన్సీల్లో నెలకొన్న ఒడిదుడుకులు ఈ పతనానికి కారణాలని చెప్పొచ్చు. ఫెడ్ భయాలు మార్కెట్లను మరో 5 శాతం కిందకు తీసుకెళ్లే చాన్సుంది. నిఫ్టీ 7,800కి చేరితే 2016-17 ఆదాయాలతో పోలిస్తే నిఫ్టీ విలువ 15 రెట్ల వద్ద ట్రేడ్ అవుతున్నట్లు లెక్క. ఇది గడిచిన పదేళ్ళ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. మరోవంక జీడీపీ వృద్ధిరేటు పుంజుకుంది కనక కంపెనీల ఆదాయాలు మెరుగుపడొచ్చు. వడ్డీరేట్లు తగ్గడం, కమోడిటీ ధరలు క్షీణించడం వంటివి కంపెనీల ఆదాయాలు పెరగడాన్ని సూచిస్తున్నాయి. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీల ఆదాయాల్లో 15 నుంచి 16 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. మన మార్కెట్ల కదలికలను గమనిస్తే ఆదాయాలు పెరుగుతున్నప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలోను... కంపెనీల ఆదాయాలు తగ్గుతున్నప్పుడు అంతకంటే తక్కువ స్థాయిలోను ఉంటున్నాయి. వచ్చే నాలుగేళ్లు కంపెనీల ఆదాయాల్లో సగటు వార్షిక వృద్ధిరేటు 15-16 శాతంగా ఉండొచ్చు. అంటే ఈ సమయంలో ఇంతకంటే ఎక్కువ స్థాయిలో సూచీలు కదిలే అవకాశాలున్నాయి. ఇవన్నీ మధ్య, దీర్ఘకాలానికి దేశీయ మార్కెట్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పడానికి సంకేతాలే.
 
 ప్రస్తుతం దేశీ మార్కెట్లకున్న ప్రధానమైన నష్టభయాలేంటి?
 పెరుగుతున్న ముడిచమురు ధరలు, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు, బలహీనమైన రుతుపవనాలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేయొచ్చు. ఒకసారి ముడిచమురు ధరలు పెరిగితే దేశ వృద్ధిరేటు దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ చైనా వృద్ధిరేటు తక్కువగా ఉండటం, డిమాండ్ కంటే చమురు సరఫరా అధికంగా ఉండటం వంటి అంశాలు స్వల్పకాలానికి ముడిచమురు ధరలు బాగా పెరగబోవని చెబుతున్నాయి. ఫెడ్ వడ్డీరేట్లు పెంచినా ఆ ఒడిదుడుకులు ఎక్కువకాలం ఉండవు. ఒక్కసారి ఫెడ్ భయాలు తొలిగితే ఇండియాకుండే ఆకర్షణ శక్తితో ఎఫ్‌ఐఐలు తిరిగి ఇన్వెస్ట్ చేయడం మొదలెడతారు. ఈసారి ఎలినినో ప్రభావం అంతగా ఉండకపోవచ్చని, వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు సరిగా లేకుంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ అటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి కనిపించడం లేదు.
 
 ఏ రంగం... ఎలా ఉండొచ్చు?
 బ్యాంకింగ్: తగ్గుతున్న వడ్డీరేట్లు, పెరుగుతున్న వృద్ధిరేటుతో ఈ రంగానికి చెందిన షేర్లు అత్యధికంగా ప్రయోజనం పొందుతాయి.ఎన్‌బీఎఫ్‌సీ: వచ్చే రెండు మూడేళ్లు వడ్డీరేట్లు ఇంతకంటే తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సేకరణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఇదే సమయంలో రుణాలకు డిమాండ్ పెరగడం ద్వారా ఈ కంపెనీల ఆదాయాలు బాగా పెరుగుతాయి.
 
 సిమెంట్: కొత్తగా సిమెంట్ ఉత్పాదన అంతగా పెరిగే అవకాశం లేదు. దీంతో మున్ముందు డిమాండ్-సరఫరా మధ్య అంతరం బాగా తగ్గొచ్చు. ఇది కంపెనీలకు ధరలు నిర్ణయించే శక్తిని పెంచుతుంది.
 ఇన్‌ఫ్రా: నిర్మాణ రంగ కంపెనీలపై పాజిటివ్‌గా ఉన్నాం. ప్రభుత్వం ఈపీసీ విధానంలో రహదారుల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపడుతోంది. రైల్వేల్లో కూడా బాగా పెట్టుబడులు పెంచుతోంది. స్మార్ట్‌సిటీల పేరుతో పట్టణప్రాంతాల్లో మౌలిక వసతులు పెంచుతున్నారు.
 
  ఇవన్నీ ఇన్ ఫ్రా రంగానికి ప్రయోజనం చేకూర్చేవే. మరోవంక చాలా ఇన్‌ఫ్రా కంపెనీలు బీవోటీలోని ఆస్తులను విక్రయించడం ద్వారా అప్పులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి.ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా: ఈ రెండు రంగాల షేర్ల పట్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ఇవి ప్రస్తుతం అధిక విలువల వద్ద ట్రేడవుతున్నాయి. కానీ దీనికి అనుగుణంగా ఈ కంపెనీల ఆదాయాలు పెరగడం లేదు.
 

>
మరిన్ని వార్తలు