రావణుడిని పూజించే గ్రామం ఇదే

10 Oct, 2016 16:14 IST|Sakshi
రావణుడిని పూజించే గ్రామం ఇదే

న్యూఢిల్లీ: నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా దుర్గామాతాకు పూజలు చేసి, విజయదశమి రోజున రావణాసురుడి మరణానికి చిహ్నంగా పండుగ చేసుకుంటారు. ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో రావణాసురుడి బొమ్మలను తయారు చేసి వాటిని బాణసంచాతో కాల్చివేస్తారు. కానీ ఢిల్లీ రాజధాని నగరానికి సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలోవున్న ఉత్తరప్రదేశ్‌లోని బిస్ రఖ్ గ్రామం రూటే వేరు.

ఈ గ్రామంలో ప్రతి ఏటా నవరాత్రుల సందర్భంగా రావణాసురుడి మరణానికి గుర్తుగా తొమ్మిది రోజులపాటు సంతాప దినాలు పాటిస్తూ నివాళులర్పిస్తారు. విజయదశమి రోజున మహా యజ్ఞాన్ని నిర్వహిస్తారు. ఈ యజ్ఞంలో గ్రామానికి చెందిన ఐదువేల మంది ప్రజలు పాల్గొంటారు. రావణాసురుడి పుట్టింది ఈ గ్రామంలోనే అని అక్కడి ప్రజల నమ్మకం. ఆయన్ని ఓ దేవిడిలా కొలుస్తారు. పూజలు చేస్తారు. రావణాసురుడి తండ్రి విశ్వారవ స్థాపించినట్లుగా భావిస్తున్న చాలా పురాతన శివాలయం ఆ గ్రామంలో ఉంది. తనకు కంటపడిన శివలింగాన్ని స్వయంగా మోసుకొచ్చి విశ్వారవ ఈ ఆలయంలో ప్రతిష్టించారని గ్రామస్థుల విశ్వాసం.

 ఆ తర్వాతి కాలంలో గ్రామంలో నిర్మించిన శ్రీబాబా మోహన్ రామ్ ఆలయంలో పది తలల రావణాసురుడి విగ్రహాన్ని గ్రామ పెద్దలు ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఈ ఆలయం వద్దనే యజ్ఞాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆలయంలో రావణాసురుడితోపాటు పలు హిందూ దేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. రావణాసురుడి విగ్రహం గురించి తెల్సిన గజియాబాద్‌లోని హిందూ సంఘానికి చెందిన కొంత మంది యువకులు గత ఆగస్టు నెల 21వ తేదీన ఈ గ్రామానికి వచ్చి ఆలయంలోని రావణాసురుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మళ్లీ రావణుడి విగ్రహాన్ని ప్రతిష్టించరాదని గ్రామస్థులను హెచ్చరించి వారు వెళ్లిపోయారు.
గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. గ్రామస్థులు రావణుడి విగ్రహం ఉండిన ప్రాంతాన్ని అద్దాల గదిగా మార్చి తాళం వేశారు. రావణాసురుడి కొత్త విగ్రహం తయారీ కోసం రాజస్థాన్‌కు చెందిన ఓ శిల్పికి ఆర్డర్ ఇచ్చామని, అది రావడానికి మరో రెండు నెలలు పడుతుందని, ఈసారికి విగ్రహం లేకుండానే ఆలయం ముందు మంగళవారం యజ్ఞం కొనసాగిస్తామని గ్రామ సర్పంచ్ అజయ్ భాటి తెలిపారు. యజ్ఞానికి సంబంధించిన సన్నాహాలు సోమవారం నుంచే ప్రారంభమయ్యాయని ప్రధాన పూజారి అఖిలేష్ శాస్త్రీ మీడియాకు తెలిపారు. తమ గ్రామంలో విజయదశమి రోజున రావణుడి పేరిట యజ్ఞం నిర్వహించడం తమ పూర్వికాల కాలం నుంచి వస్తున్న ఆచారమని, ఈసారి ఎవరు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఊరుకోమని, ఈ విషయంలో గ్రామస్థులమంతా ఒక్క మాట మీద ఉన్నామని అమిత్ భాటీ అనే ఓ గ్రామస్థుడు చెప్పారు.

దేశంలో రావణాసురుడిని పూజించే గ్రామం ఇదొక్కటే కాదు. రాజస్థాన్‌లో మండోర్ గ్రామస్థులు కూడా రావణాసురుడిని పూజిస్తారు. ఆ ప్రాంతాన్ని పాలించిన మండావర్ అనే రాజు కుమార్తె మండోధరిని రావణాసురుడు పెళ్లి చేసుకోవడం వల్ల ఆ గ్రామంలో భార్యాభర్తల విగ్రహాలు వెలిసాయని అక్కడి ప్రజల నమ్మకం.

మరిన్ని వార్తలు