అందరినీ సంప్రదించాకే విభజన నిర్ణయం

27 Aug, 2013 22:14 IST|Sakshi
అందరినీ సంప్రదించాకే విభజన నిర్ణయం

తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్... ఇలా అన్ని పార్టీల నాయకులూ అంగీకరించిన తర్వాత మాత్రమే రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. మొదట విభజనకు అనుకూలంగా మాట్లాడిన ఈ పార్టీలలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ (వైఆర్ఎస్ అని ఆ సమయంలో పొరపాటుగా చెప్పారు) పార్టీల సభ్యులు మాత్రం మాటమార్చడం ఏంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

గత కొన్ని రోజులుగా ఆంటోనీ కమిటీని పలువురు పార్టీల నాయకులు, రాజకీయాలతో సంబంధం లేనివాళ్లు కూడా కలుస్తున్నారని, ఈరోజు కూడా తాము కొంతమంది నాయకులతో సమావేశమయ్యామని ఆయన చెప్పారు. బుధవారం కూడా కొంతమంది తమను కలవాలనుకున్నారని, కానీ బుధవారం జన్మాష్టమి కావడం వల్ల మళ్లీ సెప్టెంబర్ మూడో తేదీన ఆంటోనీ కమిటీ సమావేశం అవుతోందని ఆయన తెలిపారు. ఆరోజు రావాల్సిందిగా వారికి సూచించారు.

గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరుప్రాంతాల నాయకులు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో కూడా కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా చర్చించారని, అప్పట్లో వాళ్లంతా కూడా అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి బద్ధులై ఉంటామని చెప్పడంతోనే తాము విభజనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామని.. అలాంటిది ఇప్పుడు ఉన్నట్లుండి వాళ్లంతా కూడా ఎదురు తిరగడం భావ్యం కాదని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కూడా విమర్శిస్తున్నారని, కానీ స్వయంగా బీజేపీ కూడా రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన విషయం ఆయనకు గుర్తులేదా అని దిగ్విజయ్ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు