ఇదీ ఆమిర్‌ఖాన్‌.. ఇప్పటికైనా ఒప్పుకొంటారా!

6 Apr, 2017 20:29 IST|Sakshi
ఇదీ ఆమిర్‌ఖాన్‌.. ఇప్పటికైనా ఒప్పుకొంటారా!

గొప్ప దేశభక్తి గల నటుడిగా బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌కు పేరుంది. అసహనం వివాదంలో చిక్కుకున్నా.. ఆయన తాజా సినిమా 'దంగల్‌' సినిమా దేశభక్తి చాటేదిగా.. క్రీడాలను ప్రోత్సహించేదిగా విమర్శల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఆయన వ్యక్తిత్వాన్ని చాటే మరో విషయం వెలుగులోకి వచ్చింది.

గత ఏడాది సెప్టెంబర్‌లో భారత సినిమాల విడుదలను పాకిస్థాన్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్‌ నటులపై భారత్‌లో నిషేధం విధించడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లను బాలీవుడ్‌ సినిమాల విడుదలను అడ్డుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ నిషేధాన్ని ఎత్తివేసి.. భారత సినిమాలు పాకిస్థాన్‌లో ప్రదర్శించేందుకు అనుమతించారు. పలు భారతీయ సినిమాలు అక్కడ విడుదలయ్యాయి.

ఈ నేపథ్యంలో పొరుగుదేశానికి చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్‌ 'దంగల్‌' సినిమాను పాకిస్థాన్‌లో విడుదల చేసేందుకు ముందుకొచ్చాడు. ఇందుకు ఆమిర్‌ఖాన్‌, చిత్ర యూనిట్‌ సైతం ఆనందంగా ఓకే చెప్పింది. పాక్‌లో బాలీవుడ్‌ నటుల సినిమాలకు మంచి డిమాండ్‌ ఉంటుంది కాబట్టి ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తుందని భావించారు. అయినా, ఈ సినిమా పాకిస్థాన్‌లో విడుదల కాలేదు. అందుకు కారణం.. దాయాది దేశం నుంచి వచ్చిన ఓ 'ఆశ్చర్యకరమైన డిమాండే‌'. అదేమిటంటే..

'ఈ సినిమా పాక్‌ సెన్సార్‌ బోర్డు పరిశీలనకు వెళ్లగా .. సినిమా అంతా బాగుంది కానీ, క్లైమాక్స్‌లో వచ్చే రెండు సీన్లపై మాత్రం కత్తెర వేయాలని సెన్సార్‌ బోర్డు చెప్పింది. క్లైమాక్స్‌లో రెజ్లర్‌ గీతా ఫోగట్‌ (ఫాతిమా సనా షేక్‌ ఈ పాత్రను పోషించింది) గోల్డ్‌ మెడల్‌ సాధించిన తర్వాత భారత త్రివర్ణ పతకాన్ని చూపించి సీన్‌ను, జాతీయగీతాన్ని వినిపించే సీన్‌ను తొలగించాలని పాక్‌ సెన్సార్‌ బోర్డు కోరింది' అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ డిమాండ్‌ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఆమిర్‌కు చిత్రంగా తోచిందట. 'ఇది క్రీడల నేపథ్యంగా తెరకెక్కిన సినిమా. ఇందులో ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ పాకిస్థాన్‌ ప్రస్తావన లేదు. కేవలం భారత జాతీయవాద మనోభావాలను మాత్రమే సినిమా చూపించాం. అలాంటప్పుడు అలాంటి సీన్లను తొలగించడమెందుకు?' అన్న భావనతో ఈ డిమాండ్‌కు ఆమిర్‌ ఖాన్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

హర్యానా రెజ్లర్‌ మహావీర్‌ సింగ్‌ ఫోగట్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'దంగల్‌' సినిమా దేశంలో రూ. 385 కోట్ల వసూళ్లతో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా పాక్‌లో విడుదలైతే.. మరో రూ. 10 నుంచి 12 కోట్లు నిర్మాతలకు సమకూరేవి. అంతేకాకుండా ఈ సినిమా పాక్‌లో అధికారికంగా విడుదల కాకపోతే..అక్కడ పైరసీరూపంలో విచ్చలవిడిగా దొరికే అవకాశముంది. అయినా, ఈ విషయంలో నష్టమొచ్చినా పర్వాలేదు కానీ, సినిమాలో ఆ సీన్లకు కత్తెర వేసేందుకు ఆమిర్‌ ఒప్పుకోలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆమిర్‌ ఈ విషయమై అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ.. ఆయన అధికార ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

మరిన్ని వార్తలు