ప్రపంచస్థాయి నగరంగా ఢిల్లీ...!

4 Feb, 2015 02:28 IST|Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని బీజేపీ ప్రకటించింది. ఢిల్లీ విధానసభకు మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేనిఫెస్టో స్థానంలో బీజేపీ విజన్ డాక్యుమెంట్ (దృష్టిపత్రం)ను మంగళవారం విడుదల చేసింది. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి సంబంధించి బీజేపీ తన విజన్‌ను ఈ పత్రంలో పొందుపర్చింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో విశ్వనగరంగా దేశ రాజధానిని తీర్చిదిద్దుతామని బీజేపీ హామీ ఇచ్చింది.

మహిళల భద్రత కోసం తీసుకోనున్న చర్యలు, పారదర్శక పాలనను అందించే ప్రతిపాదనలను విజన్ డాక్యుమెంట్‌లో ప్రస్తావించింది. అయితే ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించే విషయంలో ఎక్కడా ప్రస్తావించలేదు. విద్యుత్ బిల్లుల ధరలను తగ్గించడానికి కంపెనీలను ఆడిట్ చేయించడం, స్వచ్ఛమైన తాగునీటిని అందించడం, నిమ్న, మధ్యతరగతి వర్గాల వారికి తక్కువ ధరలకు ఇళ్ల నిర్మాణాలు, ఉపాధి కల్పనకు అటల్ యువ మిషన్ ఏర్పాటు వంటి హామీలను ఇచ్చింది.
 

మరిన్ని వార్తలు