రెండూ కలసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి: వైఎస్సార్‌సీపీ

19 Feb, 2014 00:57 IST|Sakshi
రెండూ కలసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి: వైఎస్సార్‌సీపీ

* కాంగ్రెస్, బీజేపీలపై వైఎస్సార్‌సీపీ ధ్వజం
* కాంగ్రెస్‌తో కుమ్మక్కు అవసరమేంటో బీజేపీ చెప్పాలి
* కేవలం 23 నిమిషాల్లో రాష్ట్ర భవితవ్యం తేల్చేయడం కంటే ఘోరం ఉంటుందా?
 
 సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ కలసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. రాష్ట్ర భవితవ్యంపై పార్లమెంటులో చర్చ జరగాలని, ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డిమాండ్లు చేసిన బీజేపీ ఎందుకు మౌనం దాల్చిందో తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని, కాంగ్రెస్‌తో కుమ్మక్కు కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఈ నలుగురూ దుష్ట చతుష్టయంగా ఏర్పడి దుర్మార్గపూరితంగా వ్యవహరించి తెలుగుజాతిని నిట్టనిలువుగా చీల్చారని మండిపడింది.
 
 మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకర్‌రావు, అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభలో టీ-బిల్లు ఆమోదించిన తీరును వారు ఎండగట్టారు. పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేసి, డాన్ మాదిరిగా చీకట్లో సభా కార్యకలాపాలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష నిదర్శనమైన పార్లమెంటులోనే దిక్కులేకపోతే ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ రోజులకన్నా క్రూరంగా వ్యవహరించి దేశ పరువు తీశారని ధ్వజమెత్తారు. వారు ఇంకా ఏమన్నారంటే..
 
  అధికారం చేతిలో ఉంది కదా అని కాంగ్రెస్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎందుకు నిలువరించలేదు? పార్లమెంటులో చర్చ జరగాలని, ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయాలని తదితర డిమాండ్లు చేసిన బీజేపీ ఎందుకు మౌనం దాల్చింది? కాంగ్రెస్‌తో ఎందుకు జతకట్టింది? ఈ విషయంలో బీజేపీ తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ కూడా కాంగ్రెస్ మాదిరిగానే తెలుగుప్రజలను దారుణంగా వంచించింది.
 
   తెలుగుప్రజల వల్లే కేంద్రంలో అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్‌కు ఏపీ పట్ల కృతజ్ఞతాభావం లేకపోగా.. బీజేపీతో విందు రాజకీయాలు చేసి నిట్టనిలువునా చీల్చింది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ భవితవ్యంపై పార్లమెంటులో కేవలం 23 నిమిషాల్లోనే ముగిస్తారా? ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా?
  గడిచిన ఆరునెలలుగా మా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రాష్ట్రాలు తిరిగి పార్టీల మద్దతు కూడగట్టడం వల్లే లోక్‌సభలో సీపీఎం, ఏఐడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన 100 మందికిపైగా సభ్యులు, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. అయితే వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఒక్కటై రాష్ట్రాన్ని చీల్చాయి.
  తలా ఒక చెయ్యి వేసి... విభజనకు కారకులైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు తెలుగు ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారు.

>
మరిన్ని వార్తలు