టీడీపీ సవాల్‌కు సై అన్న ఎమ్మెల్యే రోజా

11 Jul, 2017 15:07 IST|Sakshi
టీడీపీ సవాల్‌కు వైఎస్‌ఆర్‌ సీపీ రెడీ: రోజా

తిరుపతి : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన 9 హామీలపై టీడీపీ సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన పథకాలపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఒకవేళ అనుమానం ఉంటే చంద్రబాబును తక్షణమే రాజీనామా చేయమనాలని, ఆ పథకాలను ఎలా చేసి చూపిస్తారో జగన్‌ నిరూపిస్తారని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోజా మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ టీడీపీ బుర్రపెట్టి ఆలోచిస్తే..  2019 నాటికి...10 లక్షల కోట్ల బడ్జెట్‌లో వైఎస్‌ జగన్‌ చెప్పిన పథకాలన్నీ కచ్చితంగా అమలు అవుతాయి.

మంత్రి యనమల రామకృష్ణుడు వెంటనే అసెంబ్లీని సమావేశపరిస్తే లెక్కలతో సహా వైఎస్‌ జగన్‌ సమాధానం చెబుతారు. ఇప్పటివరకూ టీడీపీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని చూసి మాత్రమే భయపడేదని, అయితే ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ను చూసి కూడా వణికిపోతున్నారని అర్థం అవుతోంది. అయినా మా పార్టీ ఎవరి సలహాలు తీసుకుంటే టీడీపీకి ఎందుకు?.  నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ సలహాలు తీసుకున్నారు. అయితే ఆయనకు నాయకత్వం లోపించే సలహాలు తీసుకున్నారా?. మరి అలాంటి మోదీతో జతకట్టి ఎన్నికలకు ఎందుకు వెళ్లారు. ఎన్నికల్లో గెలుస్తామని చంద్రబాబుకు నమ్మకం, నాయకత్వ లక్షణాలు ఉంటే పవన్‌ కల్యాణ్‌ కాళ్లు ఎందుకు పట్టుకున్నారో చెప్పాలి.

తండ్రీకొడుకులు నిప్పా...తుప్పా?
చంద్రబాబు అనుభవనం రాష్ట్రాన్ని దోచుకోవటానికే పనికి వచ్చింది. మహిళల గురించా ఆయన మాట్లాడేది. కేబినెట్‌లో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. ఆ మంత్రులను కూడా చంద్రబాబు తీసేశారు. మహిళలను గౌరవించడం ముందు ఆయనే నేర్చుకోవాలి. రాష్ట్ర మహిళల మానప్రాణాలు రక్షించలేకపోతున్నారు. ఎక్కడికక్కడ మద్యం షాపులు పెట్టి తాళిబొట్టు తెంచుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి విజయవాడకు పారిపోయారు. ఇక ఆయన కుమారుడు లోకేశ్‌ చూస్తే కామెడీ ఆర్టిస్ట్‌ గుర్తొస్తారు. ప్రతిదానికి లోకేష్‌ సవాల్‌ అంటారు.

ఆయన యాష్‌ ట్రేకు ఎక్కువ, డస్ట్‌బిన్‌కు తక్కువ. దమ్ము, ధైర్యం ఉంటే ఇసుక దోపిడీ, విశాఖ భూ కుంభకోణం, మద్యం వ్యాపారస్తులకు ఇచ్చిన లైసెన్స్‌ల అవకతవకలు బయటపడాలంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. మీ నాన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు వస్తే దమ్మున్న మొనగాడు కాబట్టే వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణ వేశారు. తండ్రీకొడుకులు తుప్పు కాదు నిప్పు అని అనుకుంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. లోకేశ్‌ ఇంకోసారి సవాల్‌ విసిరితే.. డిక్కీ బలిసిన కోడి చికెన్‌ షాప్‌ ముందుకెళ్లి తొడ కొడితే ఏం అవుతుందో పప్పుకు కూడా అదే పరిస్థితి ఎదురు అవుతుంది’ అని అన్నారు.

సోమిరెడ్డిది సోది...
ఇక నెల్లూరు ప్రజలు ఛీకొట్టి తరిమేసిన సోమిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డిని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకుని మంత్రి పదవి ఇచ్చారని రోజా అన్నారు. సోమిరెడ్డి చెప్పేదంతా సోదేనని, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు కాబట్టే ఆయనకు చంద్రబాబు మంత్రిపదవి కట్టబెట్టారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు