కొబ్బరి చెట్లెక్కడం... ఆమెకు ఇష్టమైన పని!

8 Aug, 2017 00:30 IST|Sakshi
కొబ్బరి చెట్లెక్కడం... ఆమెకు ఇష్టమైన పని!

కొబ్బరి చెట్లెక్కి గెలలు దింపే పని సాధారణంగా మగ వాళ్లే చేస్తుంటారు. అయితే, కేరళకు చెందిన ఒక మహిళ ఉపాధి కోసం కొత్త దారి తొక్కారు. చరిత్రను తిరగరాశారు. ఒక పరికరాన్ని ఉపయోగించి సులువుగా కొబ్బరి చెట్లెక్కడంలో ఆరేళ్ల క్రితం శిక్షణ పొంది.. రోజుకు 30 చెట్ల నుంచి కొబ్బరి గెలలను దింపుతున్నారు. ఎత్తయిన చెట్లు ఎక్కుతూ  ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించారు. తన కాళ్ల మీద తాను చెట్టంత ఎత్తున నిలబడ్డారు...

తిరువనంతపురం జిల్లా వర్‌కాలా పట్టణం ‘సునీ’ స్వస్థలం. కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు కోయడంలో కేరళలోనే ఆమె తొలి మహిళా కార్మికురాలు. ఆమెను అందరూ ‘మారామ్‌ కేరీ’ అని పిలుస్తున్నారు. ఈ మాటకు ‘చెట్లెక్కే మనిషి’ అని, ‘అందరిదీ ఒకదారైతే ఈమెది మరొకదారి’ అన్న రెండర్థాలున్నాయి. రెండో అర్థంలోనే అక్కడి వారు సునీని పిలుస్తున్నారు.

ఇంట్లో వాళ్లు, బయటి వాళ్లు నిరుత్సాహపరుస్తున్నప్పటికీ.. 45 ఏళ్ల వయసులో ఆమె ధైర్యసాహసాలతో ముందడుగు వేశారు. ఆరేళ్ల క్రితం 45 రోజుల పాటు శిక్షణ పొంది మరీ ప్రత్యేకంగా రూపొందించిన పరికరాన్ని ఉపయోగించి కొబ్బరి చెట్లెక్కడం నేర్చుకున్నారు. అంతే కాకుండా.. ఈ పనిని తన వృత్తిగా ఎంపిక చేసుకున్నారు. అందరికన్నా ముందు నడచినందు వల్లే అందరూ ఆమెను ‘మారామ్‌ కేరీ’ అని పిలుస్తున్నారు.
 
కోకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ కోకోనట్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పరికరం సహాయంతో కొబ్బరి చెట్లెక్కి గెలలు కోయడంలో 2011 నుంచి శిక్షణ ఇస్తోంది.  అప్పటి వరకు మగవాళ్లు మాత్రమే కొబ్బరి చెట్లెక్కేవారు. అయితే, ఆ పురుషాధిక్య సంప్రదాయాన్ని తిరగరాస్తూ.. తొలి బ్యాచ్‌లోనే శిక్షణ పొందడానికి సునీ ధరఖాస్తు పెట్టారు. 30 మంది అభ్యర్థుల్లో ఆమె తప్ప మిగతా వారంతా మగవారే. శిక్షణ పొందడానికి ఆమె కుటుంబ సభ్యులు సహజంగానే ఒప్పుకోలేదు.

అయినా, తాను చేస్తున్న పని తప్పు కానప్పుడు మనసు మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆమె దృఢంగా నిలబడ్డారు. ఆయుర్వేద చికిత్స కోసం వెళుతున్నానని ఇంట్లో వాళ్లకు అబద్ధం చెప్పి శి„ý ణ పొందారు. ఆమెకు ఉన్న ఆసక్తికి సాధన తోడవటంతో ఆమె చెట్లు ఎక్కే పనిలో కొద్ది రోజుల్లోనే నైపుణ్యం సాధించారు. 40–60 అడుగుల ఎత్తయిన చెట్లను సైతం నిమిషంలో ఎగబాకి అలవోకగా కొబ్బరి గెలలను దింపేయడం ఆమెకు అలవాటైపోయింది.

తన ద్విచక్రవాహనం వెనుక వైపున పరికరాన్ని కట్టుకొని బయలుదేరి.. రోజుకు కనీసం 30 చెట్లు ఎక్కి కొబ్బరి కాయల గెలలను దింపుతూ.. జీవనోపాధిని పొందుతున్నారు. ఈ ఐదేళ్లలో ఆమె స్వయంగా 400 మంది మహిళలకు పరికరం సాయంతో కొబ్బరి చెట్లు ఎక్కటంలో శిక్షణ ఇచ్చి, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తోడ్పడ్డారామె. ‘ఇది మగవాళ్లు మాత్రమే చేయగలిగిన పని అని మొదట్లో నాక్కూడా అనిపించేది. మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్లు చెప్పిన మాటలు అవే కదా.. అయితే, ఇప్పుడు నా భర్త కూడా చాలా మందికి ఈ పనిలో శిక్షణ ఇస్తున్నారు. దాంతో నా పని నిరాటంకంగా సాగిపోతున్నది..’ అని నవ్వుతూ అంటారు సునీ.

నేర్చుకున్న మహిళల్లో చాలా మంది చెట్లెక్కి కొబ్బరి గెలలు కోయడాన్ని వృత్తిగా స్వీకరించడం విశేషం. వారిలో పద్మకుమారి(35) ఒకరు. ఇరుగు పొరుగు ఇళ్లలో పనులు చేస్తూ నెలకు రూ. 3 వేలు సంపాయించే పద్మకుమారి.. చెట్లెక్కడంలో శిక్షణ పొందిన తర్వాత ఇప్పుడు కేవలం 3 రోజుల్లోనే ఆ మొత్తాన్ని సంపాయిస్తోంది!
– దండేల కృష్ణ, సాగుబడి డెస్క్‌

మరిన్ని వార్తలు