అశ్రద్ధ చేస్తే ప్రాణం పోతుంది

25 Jul, 2014 23:51 IST|Sakshi
అశ్రద్ధ చేస్తే ప్రాణం పోతుంది

పాడి-పంట: జి.కొండూరు (కృష్ణా) : వర్షాకాలం వచ్చిందంటే చాలు... పశు పోషకులు కలవరపడుతుంటారు. ఎందుకంటే ఈ సీజన్‌లో పశువులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాధులు సోకడంతో పాటు ఈగలు, దోమల దాడి కూడా పెరుగుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలని, పశువులకు వైద్య చికిత్సను అందించాలని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా జి.కొండూరు మండల పశు వైద్యాధికారి డాక్టర్ కె.నరసింహారావు. ఆ వివరాలు...
 
 లేత గడ్డి ప్రమాదం
 తొలకరి వర్షాలకు మొలిచే లేత గడ్డి మొక్కలను పశువులు ఆబగా తింటుంటాయి. అయితే ఎదిగీ ఎదగని లేత గడ్డిలో హైడ్రో సైనైడ్ అనే విష పదార్థం ఉంటుంది. ఇలాంటి గడ్డిని మేసిన 15 నిమిషాలకే పశువులో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వెంటనే తగిన చికిత్స చేయించకపోతే పశువు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు సాధ్యమైనంత వరకూ పచ్చిక బయళ్లలో పశువులకు లేత గడ్డిని అతిగా మేపకుండా ఉండడమే మంచిది.
 
 గురక వ్యాధి సోకితే...
 వర్షాకాలంలో పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు (గురక) ఒకటి. ముఖ్యంగా వయసులో ఉన్న గేదె జాతి పశువుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకిన పశువుకు అకస్మాత్తుగా అధిక జ్వరం వస్తుంది. పశువు మేత మేయదు. గొంతు పైన, మెడ కింద వాపు కన్పిస్తుంది. పశువు ఆయాసపడుతూ శ్వాస పీల్చుకుంటుంది. ఆ సమయంలో గురక శబ్దం వస్తుంది. నోరు, ముక్కు నుంచి ద్రవం కారుతుంది. పశువు వణుకుతూ ఉంటుంది. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంటుంది. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే పశువు ఎడతెరిపి లేకుండా దగ్గుతూ, చివరికి అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోతుంది.
 
 వ్యాధి సోకిన పశువును వెంటనే మంద నుంచి వేరు చేయాలి. దాని మలమూత్రాలను, అది తినగా మిగిలిన గడ్డిని తీసి కాల్చేయాలి. పశువుల పాక/షెడ్డును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. వ్యాధి సోకిన పశువు మరణిస్తే ఊరికి దూరంగా తీసికెళ్లి, గొయ్యి తవ్వి, అందులో సున్నం వేసి పూడ్చేయాలి. గురక వ్యాధి లక్షణాలు కన్పించిన వెంటనే పశు వైద్యుడి సలహా మేరకు పశువుకు గ్లూకోజ్, యాంటి బయటిక్ మందు, నెప్పి నివారణ మందు ఇవ్వాలి. ఎంత త్వరగా వైద్యం చేయిస్తే పశువు అంత త్వరగా కోలుకుంటుంది. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స చేసినా ఫలితం ఉండదు.
 
 జబ్బ వాపూ ప్రమాదమే
 వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన పశువుల్లోనూ, తెల్ల జాతి పశువుల్లోనూ జబ్బవాపు వ్యాధి ఎక్కువగా కన్పిస్తుంది. వ్యాధి సోకిన పశువు అధిక జ్వరంతో బాధపడుతుంది. మేత మేయకుండా పడుకొని ఉంటుంది. జబ్బ భాగం వాచి, నల్లగా కములుతుంది. అక్కడ కండరాలు ఉబ్బుతాయి. వాటిలో గాలి బుడగలు, నీరు చేరి పశువు తీవ్రమైన నెప్పితో బాధపడుతుంది. వాచిన చోట చేతితో తాకితే గరగరమని శబ్దం వస్తుంది. సకాలంలో వైద్యం అందకపోతే పశువు నీరసించి, చనిపోతుంది. వ్యాధి సోకిన పశువుకు పశు వైద్యుని సలహా మేరకు పెన్సిలిన్ మందు ఇవ్వాలి. నెప్పి, జ్వర నివారణ మందులతో పాటు రక్తనాళాల ద్వారా గ్లూకోజ్ ద్రావణాన్ని అందించాలి. గురక, జబ్బ వ్యాధులు సోకకుండా రైతులు ముందుగానే పశువులకు టీకాలు వేయించడం మంచిది. వ్యాధి సోకిన వెంటనే అశ్రద్ధ చేయకుండా పశు వైద్యశాలకు తీసికెళ్లి తగిన చికిత్స చేయించాలి.
 
 ఈగలు-దోమలు దాడి చేస్తే...
 నేల చిత్తడిగా-వాతావరణం అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో, నీరు నిల్వ ఉన్న గుంతల్లో, మురుగు నీటి కాలువల్లో ఈగలు, దోమలు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి ఆహారం కోసం పశువులను పట్టి పీడిస్తుంటాయి. వర్షాకాలంలో వీటి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈగలు, దోమలు పశువుల శరీరంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి. వీటి తాకిడి కారణంగా పశువులు పడుకోలేవు... నిలబడలేవు. వాటిని వదిలించుకోవడానికి తోకను అటూ ఇటూ కొట్టుకుంటూ, చెవులు ఊపుతూ అసహనానికి గురవుతాయి. కడుపు నిండా మేత మేయలేవు. ఫలితంగా పశువులు రక్తహీనతకు లోనవుతాయి. ఈగలు, దోమల కాటు వల్ల పశువు శరీరంపై పుండ్లు పడతాయి. వీటి ద్వారా సూక్ష్మక్రిములు పశువు శరీరంలో ప్రవేశించి ఇతర వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. పశువులకు అంటువ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉంది.
 
 ఏం చేయాలి?
 ఈగలు, దోమల నివారణకు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కిరోసిన్‌ను పిచికారీ చేయాలి. మురుగు నీరు చేరే చోటును, చిత్తడి ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పొడి చల్లాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో పశువుల పాకలో ఎండు పిడకలు, వేపాకుతో పొగ పెట్టాలి. వైద్యుల సలహా మేరకు పశువు శరీరంపై కీటక నాశనులను పిచికారీ చేయాలి. సాయంకాలం వేళ పశువుల శరీరంపై వేపనూనె రాయాలి. అలాగే వేపాకు, పసుపు కలిపి మెత్తగా నూరి శరీరానికి పట్టించాలి.

మరిన్ని వార్తలు