పొలం గట్లపై ఆపరేషన్ ఆకర్ష్!

19 Sep, 2016 23:33 IST|Sakshi
పొలం గట్లపై ఆపరేషన్ ఆకర్ష్!

- మిత్రపురుగుల సాయంతో సేంద్రియ సేద్యంలో చీడపీడల నివారణ  
- మిత్రపురుగులను ఆకర్షించడానికి పొలం గట్లపై పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న, బంతి మొక్కల సాగు
- సత్ఫలితాలిస్తున్న ఎన్.ఐ.పి.హెచ్.ఎం. (హైదరాబాద్) పరిశోధనలు
- వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలతోపాటు.. రైతు బృందాలకూ మాతృభాషలోనే ఉచిత శిక్షణ
 
 పొలంలో ఏదో ఒకే పంటను వేసి.. రసాయనిక ఎరువులు అసలు వాడకుండా పంట పండించడం.. రసాయనిక పురుగుమందులు అసలు చల్లకుండా చీడపీడలను అదుపులో ఉంచడం కత్తి మీద సాము వంటిది. అయితే, పొలం చుట్టూ గట్లపైన కొన్ని రకాల మొక్కలు పెంచి మిత్రపురుగులకు ఆశ్రయం కల్పిస్తే.. సేంద్రియ సేద్యంలోనూ చీడపీడల బెడదను విజయవంతంగా అధిగమించవచ్చని హైదరాబాద్‌లోని జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.ఎం.) నిపుణులు రుజువు చేశారు. వరి, పత్తి, మిరప, వంగ, బెండ, వేరుశనగ వంటి పంటలను ఆశించే చీడపీడలను మిత్రపురుగుల సైన్యంతో సమర్థవంతంగా మట్టుబెట్టవచ్చని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. నిపుణులు భరోసా ఇస్తున్నారు. పంటకు తగిన పూల మొక్కలను గట్లపైన వరుసలుగా పెంచడం ద్వారా చీడపీడల సమస్య తీరడమే కాకుండా.. తేనెటీగల వల్ల పంట దిగుబడులు కూడా పెరిగాయంటున్నారు. వర్మీ కంపోస్టు, జీవన ఎరువులు, జీవ రసాయనాలతోపాటు మిత్రపురుగుల ముట్టడిలో సేంద్రియ సేద్యం చేస్తే రైతుకు దిగుబడులపై దిగులే ఉండదని ఎన్.ఐ.పి.హెచ్.ఎం.లో మొక్కల ఆరోగ్య నిర్వహణ విభాగం సంచాలకులు డాక్టర్ కె. విజయలక్ష్మి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.    

 కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ సంస్థ జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.ఎం.). దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఉంది. వర్మీ కంపోస్టు మాదిరిగానే జీవన ఎరువులు, జీవ రసాయనాలను రైతులు స్వయంగా తయారు చేసుకునేలా శిక్షణనివ్వడం.. పొలాల నాలుగు వైపులా గట్ల మీద పూలు పూచే కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా మిత్రపురుగులను పెంచి పోషించడం.. తద్వారా చీడపీడలను ప్రకృతిసిద్ధంగానే అదుపులో ఉంచడం (ఈ ప్రక్రియనే ‘ఎకలాజికల్ ఇంజినీరింగ్’ అని పిలుస్తున్నారు)పై గత రెండేళ్లుగా ఎన్.ఐ.పి.హెచ్.ఎం. క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయని, తేనెటీగల రాకతో దిగుబడులూ పెరుగుతున్నాయని ఎన్.ఐ.పి.హెచ్.ఎం.లో మొక్కల ఆరోగ్య నిర్వహణ విభాగం సంచాలకులు డాక్టర్   విజయలక్ష్మి తెలిపారు.
 
 మిత్రపురుగుల సేవలు పొందేది ఇలా..
 ఒక పంటను సాగు చేసే పొలం చుట్టూ గట్ల పైన పూత ద్వారా మిత్రపురుగులను ఆకర్షించే కొన్ని రకాల మొక్కలను వరుసలుగా సాగు చేయాలని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. చెబుతోంది. పొలంలో మిశ్రమ పంటలు కాకుండా.. ఏదో ఒకే పంట సాగు చేస్తున్నప్పటికీ.. పొలం చుట్టూ గట్లపైన పూల మొక్కల పెంపకంతో మిత్రపురుగులను ఆకర్షించి చీడపీడలను నివారించవచ్చన్నది ‘ఎకలాజికల్ ఇంజినీరింగ్’ మూలసూత్రం. ఎర పంటలు, కంచె పంటల లక్ష్యం వేరు. ‘ఎకలాజికల్ ఇంజినీరింగ్’ లక్ష్యం వేరు. ఇందులో అన్ని రకాల పంటలకూ గట్లపై నాటేందుకు ఒకే రకం పూజాతి మొక్కలు సరిపోవు. పంటలను బట్టి గట్లపై వేసే పూజాతి మొక్కలను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 గట్టు 2 అడుగుల వెడల్పు ఉండాలి. పంట వేయడానికి 15 రోజులు ముందే గట్లపై వరుసలుగా ఈ మొక్కలు వేసుకోవాలి. మిత్రపురుగులకు ఎక్కువ కాలంపాటు మకరందాన్ని, పుప్పొడిని అందించే పొద్దుతిరుగుడు, మొక్కజొన్న వంటి పూజాతి మొక్కలను గట్లపై వేసుకోవడానికి ఎంపిక చేసుకోవాలి.

 వేరుశనగ, బెండ, టమాటా, కంది, పత్తి, వంగ పంటలతోపాటు అత్యధికంగా పురుగుమందులు చల్లే మిరప పంటను కూడా ఈ పద్ధతిలో విష రసాయనాలు వాడకుండా సాగు చేయవచ్చని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. అనుభవంలో తేలింది. అంతేకాదు.. పూలున్న చోటకు తేనెటీగలు ఎక్కువ వస్తాయి. తద్వారా పరపరాగ సంపర్కం ఎక్కువగా జరిగి పంట దిగుబడులు పెరుగుతున్నాయని రుజువైంది. టమాట, బెండ పంటల్లో ఈ విధంగా గత ఏడాదికన్నా ఈ ఏడాది తమ ప్రదర్శన క్షేత్రంలో 50 శాతం దిగుబడి పెరిగిందని డా.విజయలక్ష్మి తెలిపారు.

 వేరుశనగలో పేనుబంక, తామర పురుగులకు ఎరపంటగా అలసంద ఎకరానికి 200 మొక్కల చొప్పున పొలంలో విత్తడం ద్వారా సత్ఫలితాలు వచ్చాయి. శనగపచ్చపురుగు నివారణకు ఎకరానికి 200 ఆముదం మొక్కలను పొలంలో అక్కడక్కడా వేసుకోవాలి.
 
 వరిలో సుడిదోమ నష్టం బాగా తగ్గింది..
 మన దేశంలో వరిలో సుడిదోమ వల్ల 30-40 శాతం వరకు దిగుబడి నష్టం జరుగుతోంది. ఎన్.ఐ.పి.హెచ్.ఎం.లో వరి పొలం చుట్టూ పొద్దుతిరుగుడు, బంతి వంటి మొక్కలు వేసినప్పుడు సుడిదోమ నష్టం 10%కి తగ్గిందని డా. విజయలక్ష్మి తెలిపారు. అయితే, పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయని, జనుము, బెండ, పెసర వంటి మొక్కలను సైతం ప్రయోగాత్మకంగా సాగు చేసి చూస్తున్నామన్నారు. నల్లగొండ జిల్లా కంపాసాగర్‌లో, కృష్ణా జిల్లా గరికపాడులో రైతుల పొలాల్లో ఈ ఖరీఫ్‌లో అధ్యయనం చేస్తున్నామని, ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. వరిలో మొదటి 40 రోజుల వరకు పురుగుమందులు వాడకూడదన్నది తమ అభిమతమన్నారు. అప్పటి వరకు వరి మొక్క కొత్త పిలకలు వేస్తూ, తనకు తాను నిలదొక్కుకోగలిగే రోగనిరోధక శక్తి కలిగి ఉంటుందన్నారు.

 రసాయనిక ఎరువులు వాడకుండా పంటలు సాగు చేయడం.. రసాయనిక పురుగుమందులు వాడకుండా పకడ్బందీగా సస్యరక్షణ చర్యలు చేపట్టి ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయానికి దోహదపడుతున్న ఎన్.ఐ.పి.హెచ్.ఎం. శాస్త్రవేత్తలను అభినందించాల్సిందే.
 - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
 
 చైనా, వియత్నాంలోనూ..
 ‘ఎకలాజికల్ ఇంజినీరింగ్’ ద్వారా పంటల్లో చీడపీడలను చైనా, వియత్నాం వంటి దేశాల్లోనూ అదుపు చేస్తున్నారు. చైనాలో రసాయనిక పురుగుమందులతో వరిలో సుడిదోమ అదుపులోకి రాలేదు. మిత్రపురుగులను ఆకర్షించే నువ్వు మొక్కలను వరి పొలం గట్లపై వరుసలుగా సాగు చేశారు. అప్పుడు సుడిదోమ పూర్తిగా అదుపులోకి వచ్చింది. వియత్నాంలోనూ వరి పొలాల చుట్టూ గట్లపై పూజాతి మొక్కలను పెంచుతున్నారు. చామంతి, బంతి, పొద్దుతిరుగుడు మొక్కలను దగ్గర దగ్గరగా 3 వరుసల్లో సాగు చేస్తూ చీడపీడలను అదుపులో ఉంచుతున్నారు. ప్రకృతి సేవల ద్వారా చీడపీడలను ఇలా అదుపు చేస్తున్న రైతులను ప్రోత్సహించడం కోసం వియత్నాం ప్రభుత్వం 2015 జనవరి నుంచి ప్రత్యేక నగదు పారితోషికాలను (ఎకరానికి రూ. 400 నుంచి 500 వరకు) అందిస్తుండడం విశేషం.
 
 తెలుగు రాష్ట్రాల రైతులకు 3 రోజుల ఉచిత శిక్షణ
 జాతీయ స్థాయి సంస్థ అయిన ఎన్.ఐ.పి.హెచ్.ఎం. పర్యావరణ హితమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై శాస్త్రవేత్తలతోపాటు రైతులకు కూడా శిక్షణ ఇస్తున్నది. వర్మీకంపోస్టులో ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రం, సూడోమోనాస్ బాక్టీరియా కలిపి సేంద్రియ ఎరువు తయారు చేసుకోవడం.. పొటాష్, ఫాస్పేటులను మొక్కలకు అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువులను, జీవ రసాయనాలను రైతు స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం, మిత్రపురుగుల సంతతిని పెంపొందించే చర్యలపై శిక్షణ ఇస్తారు. కనీసం 20 మంది రైతులు బృందంగా ఏర్పడి, తమను 040- 24015932 నంబరులో సంప్రదిస్తే 3 రోజులపాటు శిక్షణ ఉచితంగా ఇస్తామని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. మొక్కల ఆరోగ్య నిర్వహణ విభాగం సంచాలకులు డాక్టర్ కె. విజయలక్ష్మి తెలిపారు. అయితే, భోజన ఖర్చులు రైతులే భరించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల గుంటూరు ప్రాంత రైతులకు మిరప, పొగాకు సాగులో శిక్షణ ఇచ్చామన్నారు. కేరళ, తమిళనాడుల నుంచి అత్యధిక సంఖ్యలో శాస్త్రవేత్తలు, రైతులు శిక్షణ పొందుతున్నారని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు