పార్వతీపురం రైతుకు పేటెంట్‌ మంజూరు చేసిన భారత ప్రభుత్వం

7 Nov, 2023 16:53 IST|Sakshi

బహుళ పంటలను ఒకేసారి విత్తుకునేందుకు అన్ని విధాలుగా రైతుకు ఉపయోగకరమైన వినూత్న పరికరం (డ్రమ్‌సీడర్‌)ను రూపొందించిన పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన గ్రామీణ ఆవిష్కర్త దమరసింగి బాబూరావుకు భారత ప్రభుత్వం పేటెంట్‌ మంజూరు చేసింది. తొలుత ఇనుముతో తయారు చేసిన ఈ పరికరంపై పేటెంట్‌కు 2015లోనే ఆయన దరఖాస్తు చేయగా, ఇటీవలే పేటెంట్‌ సర్టిఫికెట్‌ అందింది. తదనంతరం మరింత తేలిగ్గా ఉండాలన్న లక్ష్యంతో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తక్కువ బరువుతో ఉండేలా, ఎక్కువ కాలం మన్నిక ఉండేలా బాబూరావు దీన్ని మెరుగుపరిచారు.

2 ఎం.ఎం. సైజు నుంచి 16 ఎం.ఎం. సైజు వరకు ఎంత సైజు ఉన్న ఏ పంట విత్తనాలనైనా స్వయంగా రైతే స్వల్ప మార్పులు చేసుకోవటానికి, వరుసల మధ్య దూరాన్ని కూడా అనుకూలంగా సులువుగా మార్చుకోవటానికి ఈ డ్రమ్‌సీడర్‌ అనువుగా ఉంది. పత్తి, పెసలు, కందులు వంటి మూడు పంటలను ఒకేసారి విత్తుకోవడానికి ఈ ఆధునిక డ్రమ్‌సీడర్‌ ఉపయోగపడుతుండటం విశేషం. అన్ని రకాల చిరుధాన్యాలు, నువ్వులు, వేరుశనగ, బఠాణి, గోధుమ, వరి, పెసర, మినుము, పుల్లశనగ, పెద్ద బఠాణి, పెద్ద వేరుశనగలను సైతం దీనితో విత్తుకోవచ్చు. దీనికి ఏడు సీడ్‌ బాక్సులు అమర్చారు. 


రైతులే మార్పులు చేసుకోవచ్చు
2.5 అడుగులు (30 అంగుళాల) ఎత్తున ఇరువైపులా చక్రాలను అమర్చటం, 6 అంగుళాల వెడల్పు గల చక్రాలను అమర్చటంతో దీన్ని ఉపయోగించటం సులువు. పెద్ద చక్రాలను ఏర్పాటు చేయటం, పంటను బట్టి విత్తనం సైజును బట్టి, వరుసల మధ్య దూరాన్ని బట్టి మార్పులు చేసుకోవడానికి చక్రాలను ఇప్పి మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా రెండు స్క్రూలు ఇప్పితే చాలు అవసరమైన మార్పులు మెకానెక్‌ అవసరం లేకుండా రైతే స్వయంగా చేసుకోవచ్చని, అందుకే ఈ డ్రమ్‌సీడర్‌ తక్కువ కాలంలోనే రైతుల ఆదరణ పొందిందని బాబూరావు ‘సాక్షి’తో చెప్పారు. 

నాలుగు వేరియంట్లు
ఎకనామిక్‌ మల్టీపర్పస్‌ అగ్రికల్చర్‌ ఇంప్లిమెంట్‌ అని పిలుస్తున్నారు. ఇందులో నాలుగు వేరియంట్లను బాబూరావు రైతులకు అందుబాటులోకి తెచ్చారు. పొలంలో యంత్రాలు అవసరం లేకుండా ఇద్దరు మనుషులు సులువుగా లాగుతూ విత్తనాలు వేసుకునే విధంగా, జోడెడ్లకు కట్టి లాక్కెళ్లేలా, ట్రాక్టర్‌కు వెనుక బిగించే విధంగా, 6.5 హెచ్‌పి హోండా ఇంజన్‌తో అనుసంధానం చేసి ఒక మనిషి నడిపే విధంగా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో డ్రమ్‌సీడర్లను ఆయన రూపొందించారు.

వేరియంట్‌ను బట్టి దాని ధర, బరువు ఆధారపడి ఉంటుంది. మనుషులు లక్కెళ్లే దాని బరువు 25 కిలోలు ఉంటుంది. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసేది 80 కిలోల బరువు ఉంటుంది. ‘ఆంగ్రూ’ పోషణ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ బాబూరావుకు రూ. 4 లక్షల గ్రాంటు ఇవ్వటం విశేషం. పల్లెసృజన తోడ్పాటుతో రాష్ట్రపతి భవన్‌లోని ఇన్నోవేషన్‌ ఫెస్టివల్‌తో పాటు అనేక మేళాల్లో బాబూరావు (94409  40025) ఈ డ్రమ్‌సీడర్‌ను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.  

ప్రకృతి సేద్యంపై ఎన్‌ఐపిహెచ్‌ఎం సర్టిఫికెట్‌ కోర్సు

ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేపట్టదలచిన/ చేపట్టిన కనీసం ఇంటర్‌ చదివిన యువతకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖకు అనుబంధ సంస్థ, హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహించనుంది. ‘ప్రకృతి/సేంద్రియ వ్యవసాయంలో మొక్కల ఆరోగ్య యాజమాన్యం’ పేరుతో వచ్చే డిసెంబర్‌ నుంచి 3 నెలల సర్టిఫికెట్‌ కోర్సులో శిక్షణ ఇస్తారు. కోర్సు కాలపరిమితి డిసెంబర్‌ 6 నుంచి 2014 మార్చి 13 వరకు. యువతీ యువకులకు శిక్షణ ఇవ్వటం ద్వారా గ్రామస్థాయిలో మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేయటం ఈ సర్టిఫికెట్‌ కోర్సు లక్ష్యం.

తరగతి గదిలో పాఠాలతో పాటు పొలంలో పని చేస్తూ నేర్చుకునే పద్ధతులు కూడా ఈ కోర్సులో భాగం చేశారు. ఇంటర్‌ పూర్తి చేసిన లేదా వ్యవసాయ పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన 18 ఏళ్లు నిండిన గ్రామీణ యువతకు ఈ కోర్సు అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు. కోర్సు ఫీజు రూ. 7,500. ఎన్‌ఐపిహెచ్‌ఎంలో ఉండి శిక్షణ పొందే రోజుల్లో ఉచిత వసతి కల్పిస్తారు. భోజన ఖర్చులు అభ్యుర్థులే భరించాల్సి ఉంటుంది. కోర్సు డైరెక్టర్‌గా డా. ఒ.పి. శర్మ  వ్యవహరిస్తున్నారు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్‌ డా. కె. దామోదరాచారి (95426 38020)ని సంప్రదించవచ్చు. నవంబర్‌ 20లోగా ఫీజు చెల్లించి, దరఖాస్తులు పంపాలి. 

డిసెంబర్‌ 22 నుంచి ఏపీ పుష్ప ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి నాలుగో పుష్ప ప్రదర్శన, అమ్మకం కార్యక్రమాన్ని డిసెంబర్‌ 22 నుంచి 27 వరకు జరగనుంది. విజయవాడలోని (పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డు) సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజి గ్రౌండ్‌లో జరుగుతుంది. వివరాలకు.. 93935 77018. 

మరిన్ని వార్తలు