-

ముడి బియ్యం ఇక ముంగిట్లోనే!

19 May, 2015 11:59 IST|Sakshi
ముడి బియ్యం ఇక ముంగిట్లోనే!

 ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ ముడి బియ్యం తినే వారి సంఖ్య పెరుగుతోంది. ముడిబియ్యానికి త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి, అవసరం మేరకు బస్తా, రెండు బస్తాల ధాన్యం ముడిబియ్యం మర పట్టించుకొని ఇంట్లోకి వాడుకునే ప్రకృతి వ్యవసాయదారులకు.. లేదా వినియోగదారులకు నేరుగా ముడిబియ్యం అమ్ముకునే రైతులకు, స్వయం సహాయక బృందాలకు తరచూ రైస్ మిల్లుకు వెళ్లాల్సి రావటం చాలా వ్యయప్రయాసలతో కూడిన పని. ఇంటి దగ్గరే పెట్టుకొని బియ్యం మరపట్టుకునేందుకు వీలయ్యే చిన్న రైస్ మిల్లును కొనితెచ్చుకోవటమే దీనికి సరైన పరిష్కారం. వీరికి ఉపయోగపడే చిన్న రైస్ మిల్లు (రైస్ డీ-హస్కింగ్ మెషిన్)ను మహారాష్ట్రలోని విజ్ఞానాశ్రమం అనే లాభాపేక్ష లేని సంస్థ రూపొందించింది.  పుణేకు 70 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇంటిపట్టునే పెట్టుకొని అవసరమైనప్పుడల్లా ముడి బియ్యం ఆడించుకోవటానికి ఇదెంతో అనువుగా ఉంటుందని లాబ్ టెస్ట్‌లో నిర్థారణైందని విజ్ఞానాశ్రమం తెలిపింది.

 

3 చదరపు అడుగుల పొడవు, 4 చదరపు అడుగుల వెడల్పు స్థలం దీనికి సరిపోతుంది.  గంటకు 10 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్ చేయగలదు. దీని బరువు సుమారు 125 కిలోలు. 1 హెచ్‌పీ మోటర్‌తో, 230 వోల్టుల ఏసీ కరెంట్‌తో నడుస్తుంది. దీన్ని ఉపయోగించటం సులభం. నిర్వహణ ఖర్చులూ తక్కువే.  ధర రూ.20 వేలకు పైగా ఉండొచ్చని అంచనా. లావు లేదా సన్న రకాల ధాన్యాలేవైనా పిచుకలు వొలిచినట్లు వొలిచి ముడి బియ్యాన్నిస్తుంది. స్టీల్ ప్లేట్లకు బదులు రబ్బరును ఉపయోగించడం వల్ల నూక తక్కువగా వస్తున్నది.  10, 40 హెచ్‌పీ మోటర్లతో నడిచే పెద్ద రైస్ మిల్లులతో పోల్చినప్పుడు.. ఇది అనేక విధాలుగా మెరుగైనదని తేలినట్లు విజ్ఞానాశ్రమం తెలిపింది. బాగుంది కదండీ.. చిన్న రైస్ మిల్లు!
              - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్

మరిన్ని వార్తలు